పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెలుగుబడిచదువు అనగా చిన్నబాలశిక్ష కొన్ని ఆట విడుపుపద్యములు, ఎక్కములు మొదలగునవి. మాకంటె పెద్దబాలురు కొందరు వెరసులువేయుచుండిరి. అనగా నింగ్లీషులో practice లెక్కలవంటివి.

నా తొమ్మిదవయేట కలప మొదలగునవి మా నాయనగారు బెజవాడనుండి కొనితెచ్చి మా మూడువందలగజముల ఖాళీస్థలములోనే చిన్న పెంకుటిభవంతి కట్టించి, అందులో కాపురముండిరి. మా తండ్రిగారు మ్రొక్కినమ్రొక్కుబడి చెల్లించుటకు వైకుంఠపుర దేవాలయములో నాకు పుట్టువెంట్రుకలు తీయించి ఉపనయనముగూడ చేసిరి.

మా తండ్రిగారు చాల మితవ్యయపరులు. మా తల్లిగారికి గట్టిపట్టు చేతగాదని ఆమెను కోపించుచుండెడివారు. మా తండ్రిగారు ఆకోమటి గుమాస్తాపనియే చేయుచుండిరి. మధ్యాహ్నమున భోజనమునకు ఇంటికి వచ్చునపుడు వాకిటిలో ముష్టిపెట్టునపుడు రాలినగింజలు చూచి కోపించి ఆగింజలు ఎత్తువరకును లోపలికి వచ్చువారుకారు. ఎవ్వరియొద్దను అరువుగాని, బదులుగాని త్చెచుట ఆయనకు అయిష్టము. ఇంట లేనివస్తువు ముందుగా చెప్పవలసినదని మాటిమాటికి మాతల్లిగారిని హెచ్చరించుచుండెడివారు.

తాకట్టుఋణము తీర్చినపిమ్మట వా రెవ్వరివద్దను అప్పుతెచ్చియుండలేదు. ఇతరులకు ఋణము లిచ్చుచుండెడివారు.