పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/26

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నాకు అయిదవఏడు రాకముందు ఎదో కాయలా ఏర్పడెను. మా నాయనమ్మగారును ఏదో జబ్బువలన చనిపోయెను. ఆమె అస్తులను వైకుంఠపురమునకు గొనిపోయి కృష్ణలో గలిపి తిరిగివచ్చునపుడు నాకు కాయలా నయమైన యెడల నా పుట్టు వెంట్రుకలు తీయించి ఉపనయనము అచ్చటి స్వామి దేవాలయములో చేయుదునని మా తండ్రిగారు మ్రొక్కుకొని వచ్చెనట.

విద్యాభ్యాసము

అయిదవఏట నన్ను బడిలో చదువవేసిరి. ఆరోజున నాకాళ్ళకు ముచ్చలజో డొకటి తొడిగి క్రొత్తరుమాల నాపైన గప్పిరి. బడిపంతులు పిల్లలతోగూడ మాయింటికి వచ్చిరి. ఓం నమశ్శివాయ సిద్ధం నమ: అనువాక్యములు వ్రాయించిరి. పిమ్మట పంతులుగారు నన్ను తనచంకను బెట్టుకొని బడికి తీసికొనిపోయిరి. చదువులబడి పాతగుంటూరులో మరియొకబజారులో నొక పెద్దఅగ్రహారీకులైన మర్ధ్వులయింట నుండెను. ఆయింటివారి పిల్లవాడను చదువుకొనుచుండెను. పంతులుగారు ఆయింటిలోనే ఒక వైపున కాపురముండిరి.

ఆయింటి యజమానురాలు నన్ను దయతో చూచుచుండెను. తన కుమారునితోపాటుగ నా తలయును దువ్వుచు ప్రేమతో మాట్లాడుచుండెను. అందరికంటె ముందు బడికి పోవుచుండినందున శ్రీయో చుక్కయో నాకే లభించుచుండెను. బాలు రందరిలో నొకకొంత చురుకైనవాడని నన్ను భావించుచుండిరి.