పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకులకంటె మున్నూరుమంది అనుకూలురే అధికముగ లెక్కకు వచ్చిరి. ఇట్లు జయముచేకూరినను కొందరైనను వ్యతిరేకులుండుటచే ప్రజలకు ఉద్యమముపట్ల పట్టుదల కొరతగనే యుండెనని స్పష్టమయ్యెను. కాని ఈవ్యతిరేకాభిప్రాయము కొందరు ప్రముఖుల పలుకుబడిచే నేర్పడినదేగాని స్వతంత్రము కాదు. ఈ జయమునకు శ్రీ కోడి రామమూర్తిగారు సామాన్యప్రజలతో కలసి మాట్లాడుటగూడ చాల ఉపయోగించినది. రామమూర్తి గారు అభినవభీము డని పేరుపొందిన జగజెట్టి. హిందీలోనూ, తెలుగుభాషలోనూ ధారాళముగ నుపన్యసించి ప్రజల హృదయములను రంజింపజేయుచుండెడివాడు. శ్రీ వెంకటరంగయ్యగారు తమ ఉపన్యాసములో ఆంధ్రరాష్ట్రనిర్మాణమును సహేతుకముగ బలపరచిరి. ఆంధ్రులు ప్రత్యేకరాష్ట్రము కోరుట ఆత్మవ్యక్తిత్వసిద్ధినిమిత్తమే యని స్పష్టీకరించిరి. ఆరవ ఆంధ్రమహాసభను కర్నూలుప్రతినిధులు నంద్యాలకు ఆహ్వానించిరి.


_____________