పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/251

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మూర్తిగా రప్పుడు చెన్నపట్టణములో గవర్నమెంటుట్రాన్సులేటరు ఉద్యోగము చేయుచుండిరిగాన "మనముపెట్టుకొన్న పదిసంవత్సరములు గడువు నేటితో ముగిసినది. నేను నావృత్తిని విసర్జించితిని, మీరును మీఉద్యోగము మాని, నాతో కలియవలె" నని కోరుచు వారికి జాబు వ్రాసితిని. ఇట్లునా వృత్తివిసర్జనచేయుట పలువురకు విపరీతముగ గాన్పించెను. పుష్కలముగ ద్రవ్యార్జన చేసుకొనుచు తినుచుతినుచున్న అన్నపుబాత్రను తటాలున బోర్లత్రోసుకొను వెఱ్ఱివానివలె వృత్తిని విడనాడితినని తలంచుచుండిరి. నాబంధువులకెవ్వరికిని సమ్మతి లేదయ్యెను. నాభార్యకును ఇష్టములేకున్నను అంతగా కలవరముచెందక శాంతమువహించి యూరకుండెను. గుమాస్తాలు బొత్తుగ సహింప జాలకుండిరి. నా పెద్దగుమాస్తా కౌతా పుండరికాక్షుడు నాదగ్గరకువచ్చి, కంట నీరుబెట్టుకొని "ఇంకను కొన్నిసంవత్సరములు హాయిగా పనిచేయుచు మమ్మునుగూడ రక్షించరాదా? మీరు వృత్తివదలుటతో మేము నీరింకిన గుంటలోని చేపలవలె బయటపడి నశించవలసినదే" యని చెప్పుచు మిక్కిలి దు:ఖించెను. నాయొద్దపనిలో ప్రవేశించినప్పటినుంచి అతడు సంసారముతో సుఖముగ కాలము జరుపుకొనుచుండెను. ఆతనిమాటలు వినినప్పుడు నామనసున జాలికలిగెనుగాని నేను వృత్తి మానినంతమాత్రమున అతనికి జీవనము జరుగకపోదనియు, ఎవరియొద్దనో పొట్టపోసుకొన గలడనియు తలంచి అతనినోదార్చి, అప్పీళ్ళు మొదలగు రికార్డులు తెప్పించి అవి ఏఏప్లీడర్లకు పంచిపెట్టవలెనాయని యోచించుకొంటిని. అప్పటికి నాయొద్ద జూనియరుగా పనిచేయుచున్న శ్రీ వెలగపూడి సుబ్బారావుగారు మంచి బుద్ధికుశలతగలవారు.