పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హము చేసుకొనవలెనని కుతూహలము కలిగెను. మాతల్లి, వలివేటికాపురస్తులు తిమ్మరాజు గోపాలరాయుడుగారి కుమార్తె అయినను మట్టెగుంట నారాయుడుగారు తనకు పిల్లలు లేకపోవుటచేత ఆమెను తెచ్చుకొని పెంచుకొనుచుండెను. ఆ నారాయుడుగారు పాతగుంటూరులో మా ఇంటికి సమీపములోనే కాపురముండిరి. కలసిన బంధుత్వమే యగుటచేత ఆమెను మా నాయనగారి కిచ్చి వివాహముచేసిరి. ఏదో కొంత సంపాదించుకొనుచున్నను వివాహఖర్చులకుగాను ఒక బందుగురాలియొద్ద అప్పుతెచ్చుకొనెను. కాని ఆమె కొలదిరోజులలోనే తన బాకీ చెల్లించవలసినదని నడిబజారులో తగాదాపరచినందున అగౌరవముగా తోచి రామచంద్రపురపు అగ్రహారములో పెన్షను పుచ్చుకొన్న ఒక తహశ్శీలుదారునొద్ద తన యీనాము పదునైదు యకరములు తాకట్టుపెట్టి ఆమెబాకీ వెంటనే చెల్లించెను. కాని తాకట్టు వ్రాసి సొమ్ము తెచ్చినదిమొదలు దానిని సాధ్యమైనంతత్వరలో తీర్చివేయవలెనని పట్టుపట్టి కొన్ని మాసములలో బాకీ చెల్లించి, తాకట్టు విడిపించుకొనెను. మా తండ్రిగారు నానాటికి సంపాదనపరు లగుచుండిరి. నాకు ముందు నా తల్లిగారికి ఒక ఆడపిల్ల పుట్టెను. పిమ్మట రెండేండ్లకు నేను జనన మొందితిని. మా అక్క పసితనముననే చనిపోయెను. మా తల్లిగారికి పిమ్మట ఏడేండ్లవరకును సంతానము లేదు. కాబట్టి ఆమెయొద్ద నేను చాలకాలము స్తన్యపానము చేయుచుంటిని. మా తల్లిగారు ప్రతిదినమును సూర్యునకు నమస్కారము చేసిననేగాని భోజనముచేయునదిగాదు. మభ్భుపట్టి సూర్య బింబము కనుబడని రోజామె కుపవాసమే.