పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/245

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కట్టబడిన దివ్యభవనములలో నివసించుచు కచ్చేరీలలో పనిచేయుచుందురు. శాసనసభలుకూడ ఆకాలములో అచటనే సమావేశమగుచుండెను. ఈపర్వతప్రస్థానమువలన ప్రతిసంవత్సరము మితిలేని ఖర్చు అగుచుండుటచే కాంగ్రెసుమహాసభ ఈప్రస్థానములను మానవలసినదని తీర్మానించుచుండెను. పిమ్మటి కాలమున అచటశాసనసభాసమావేశములును, ప్రభుత్వప్రస్థానములును ఆగిపోయినవి. శీతలము, రమణీయమునగు ఆప్రదేశమున కొండ లెక్కుచు, దిగుచు మేఘములు జొచ్చిపోయి, వానితో దాగుడుమూతలాడుచు ఆ వేసవి గడపి యింటికి చేరునప్పటికి నాస్వరూపమును జూచి, మాయింటిలోనివా రందరును సంతసించిరి. నాశరీరము మెరుగెక్కి, స్ఫుటముగనుండెను.

వేటపాలెములోనిబంగళాలు నాకు కొత్తవ్యయములకు కారణమైనవి. అచ్చట చెదులు విశేషముగ నుండుటచే అప్పుడపుడు చిన్న చిన్న మరమ్మతులు గోరుచుండెను. విద్యాశాలస్థాపింతు నన్న, అచ్చట నిలచి దాని పరిపాలనాభారము వహించువారు కనుబడకుండిరి. శ్రీ రాయసం వెంకటశివుడుగారిని ఈ బాధ్యత వహించవలసినదని కోరితిని. వారు స్త్రీవిద్యాభిమానులు. స్త్రీల జ్ఞానాభివృద్ధినిమిత్తము "జనానా" యను పత్రిక నొకదానిని కొన్నిసంవత్సరములు ప్రకటించుచుండిరి. సంస్కరణాభిమానము, నియమనిష్ఠలు గలవారుగాన సర్వవిధముల స్త్రీ విద్యాశాలకు అధ్యక్షతవహింప నర్హులని నేను ఆశించితిని. కాని వారు సమ్మతించరైరి. శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణగారిని గూడ అడిగితిని. వారును అంగీకరించలేదు. ఇట్లు కాలము గడచి