పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/233

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ద్వారముగుండ మెలికలుదిరిగి వెళ్ళవలసి యుండెను. మాతో దేశపాండ్య సుబ్బారావుగారు గుత్తికోట పట్టుకొనబోవుచున్నామని హాస్యవచనములు బల్కుచుండ మేము ఆపురమును జేరితిమి. ఆసాయంకాలమే మహాసభ సమావేశపరచబడెను. శ్రీ కేశవపిళ్ళెగారు అధ్యక్షతవహించిరి. ఆంధ్రుల పూర్వ వైభవమును, ఇప్పటి దుస్థితియు వర్ణించి, ఆంధ్రరాష్ట్రనిర్మాణావశ్యకము దాని ప్రయోజనములును వివరించుచు మాలో ఒకరివెనుక నొకరము ఉపన్యసించితిమి. కేశవపిళ్ళెగారు నయవచనములతో మమ్ము సన్మానించుచు పల్కి, మాఉపన్యాసములనుగూర్చి ముచ్చటించిరి. రాబోవు ఆంధ్రమహాసభకు అధ్యక్షతవహించవలెనని కోరగా సంతోషముతో నంగీకరించిరి. మేము మరునాడు బయలుదేరి కడప, అనంతపురము, బళ్ళారి, హిందూపురముమొదలగు పట్టణములలో మహాసభలుగావించి ఆంధ్రరాష్ట్రనిర్మాణమునుగూర్చి ప్రచారము చేసితిమి. బళ్ళారిలో లక్ష్మణస్వామి మొదలియారుగారు అధ్యక్షతవహించి మాఉపన్యాసమునందలి తెలుగుభాషనుమాత్రము ప్రస్తుతించి, ప్రత్యేక రాష్ట్రనిర్మాణవిషయమును పూర్ణముగ ఖండించిరి. ఇచ్చటతప్ప తక్కినచోట్ల ప్రజాభిప్రాయము అనుకూలముగనే యుండెను. కేశవపిళ్ళెగారు సానుభూతివచనములు పలికి, రాబోవుసభకు అధ్యక్షతవహించుటకు సమ్మతించినందున రాష్ట్రనిర్మాణవిషయమున అనుకూలురేయని యెంచి, పత్రికలకు వ్రాసితిమి. ఆయన వెంటనే తనయభిప్రాయము వ్యతిరేకముగ నున్నదని ప్రకటించిరి. ఇది మా కొకకొంత ఆశ్చర్యమును కల్పించెను.