పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముదరక మునుపే లేచి, ప్రజాభిప్రాయమును సమకూర్చుకొనకయే ఈతీరుమానమును ప్రవేశపెట్టుట సరికా దను వాదన సమంజసముగ నున్నదనియు, మనలో ప్రముఖుల యుద్దేశములను గూడ పాటింపవలసియున్నదనియు నుడివి, రాష్ట్రనిర్మాణము ఆంధ్రులపురోభివృద్ధికి అవసరమని నమ్మువాడనైనను అందు విషయమున ప్రజలలో ఆందోళనగావించి అంగీకారమును చేకూర్చుకొనుట యుక్తమనియే నేను నాఅభిప్రాయమును వెలిబుచ్చితిని. ఒక సంవత్సరకాలము ఇట్టి ప్రచారము దేశమంతట గావించి, మన ప్రముఖులనుగూడ సమ్మతిపరచి, ముందు సంవత్సరము ఈతీర్మానమును ప్రవేశపెట్టవచ్చునని పలికినమీదట సభలో నామాటలు అంగీకృతముగ గన్పడినందున ఆంధ్రోద్యమ స్థాయిసంఘమువారిని దేశమున ప్రచారముసల్పి ఏకాభిప్రాయమును సమకూర్చుడని కోరుచు తీర్మానము సవరణకాబడి మహాసభచే నంగీకరించబడెను.

1913 డిశంబరులో ఆంధ్రదేశములో రాయలసీమలో ప్రచారనిమిత్తము శ్రీ పట్టాభిసీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు, వల్లూరి సూర్యనారాయణరావుగార్లును నేనును ప్రచారసంఘముగా నేర్పడి పర్యటనజేయ నారంభించితిమి. నంద్యాలలో దేశపాండ్య సుబ్బారావుగారిని కలుసుకొని ఆయూరిలో మహాసభసమావేశపరచి ఉపన్యసించితిమి. పిమ్మట గుత్తి కేగితిమి. ఊరివెలుపల పెద్దసత్ర మొకటి కలదు. ఆసత్రములో మాకు భోజనమజ్జనాదులకు వసతిఏర్పరచిరి. గుత్తిలోపల ప్రవేశించుటకు ఇరుప్రక్కల నెత్తగు రాతిగోడలుగల పురాతన దుర్గ