పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రోద్యమము అనుపేరుతో చిన్నపొత్తమును తెలుగునను, ఇంగ్లీషునగూడ నేను వ్రాసి, సిద్ధముచేసితిని. ఈప్రయత్నమున జొన్నవిత్తుల గురునాధముగారు తోడయ్యెను.

ప్రథమాంధ్రసభ

1913 సంవత్సరము వేసవిసెలవులలో బాపట్లలో గుంటూరుజిల్లాకాంగ్రెసుమహాసభ జరుపుటకు నిర్ధారణ కాబడెను. అక్కడ ఈభారమును వహించినవారిలో, నా చిరమిత్రుడు చోరగుడి వెంకటాద్రిగారు ముఖ్యులు. ఈయన బాపట్లలో న్యాయవాది. హాస్యరసప్రాధానముగా ప్రసంగించు నేర్పరి. దేశహితైకకార్యములందు దీక్షతో కృషిచేయుచుండెను. కాబట్టి ఆంధ్రమహాసభ జిల్లాకాంగ్రెసుసభతోగూడ జరిపించవలెనని సన్మానసంఘమువారు అత్యుత్సాహముతో అంగీకరించి వెంకటాద్రిగారిని అధ్యక్షులుగా వరించిరి. నిడదవోలు తీర్మానము ననుసరించి ఏర్పడిన గుంటూరుజిల్లాసంఘమునకు నేను అధ్యక్షుడను. కావున గుంటూరుజిల్లాకాంగ్రెసుసభయు దాని వెంటనే ప్రధమాంధ్రమహాసభయును బాపట్లలో సమావేశపరుపబడునని పత్రికలలో ప్రచురింపబడెను. ఆంధ్రోద్యమ గ్రంధములు విరివిగ దేశములో పంచిపెట్టబడెను.

భాష ననుసరించి బంగాళము, బేహారు వేరుపరచి ప్రత్యేకరాష్ట్రములుగ నేర్పరచిననాటనుండి గుంటూరులో ఆంధ్రరాష్ట్రనిర్మాణమునుగూర్చి (Young men's Literary Association)