పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లక్ష్మీనారయణగారు గుంటూరుజిల్లా సత్తెనపల్లితాలూకా వేమలూరిపాడుకాపురస్థులు, సెకండుగ్రేడుప్లీడరీలోకృతార్థులై గుంటూరులోనే న్యాయవాదిగా నుండిరి. రాజకీయ, సాంఘిక సంస్కరణములందు ఉత్సాహముతో పనిచేయుచు వితంతూద్వాహములు జరిపి సంఘబహిష్కరణవలన పడరాని ఇడుములకు నోర్చి, పిమ్మట ఇంగ్లాండునకు బోయి, బారిష్టరుపరీక్షలో కృతార్థులై, హైకోర్టులో పనిచేయుచుండిరి. వీరికి యువకులలో హెచ్చుపలుకుబడి కలదు. జొన్నవిత్తుల గురునాధముగారు కృష్ణాజిల్లావారు. బి. ఏ. పరీక్షయందు కృతార్థులై ఆంగ్లేయభాషారచనయందు సామర్థ్యము, భారతదేశ రాజకీయవిజ్ఞానము, దేశభక్తియు, త్యాగబుద్ధియు, కల్గిన ఉత్సాహమూర్తి. తరచు "హిందూ" మొదలగు ఇంగ్లీషుపత్రికలకు వ్యాసములు వ్రాసి పంపుచుండెను. కురుపాంజమీందారుగారియొద్ద స్వల్పకాలము కార్యదర్శిగ నుండి, వారిమార్గములు తనకు కుదరక ఆఉద్యోగమును వదలి స్నేహితులసహాయముతో గాలిజీవనము చేయుచుండెను. చల్లా శేషగిరిరావుగారుకూడ ఉత్సాహశీలియగు యువకుడు. దేశాభిమానిపత్రికకు వ్యాసములువ్రాయుచు రాజకీయములలో అభినివేశము ప్రకటించుచుండెను.

ఆనాడు జరిగిన సంభాషణలలో ఆంధ్రజిల్లాలను చెన్నపురిరాష్ట్రమునుండి విడదీసి, ప్రత్యేకరాష్ట్రముగా నిర్మాణము చేయవలసినదనియు, రాష్ట్రాంగములైన హైకోర్టు, రెవిన్యూబోర్డు మొదలగున వన్నియు ప్రత్యేకముగ నేర్పడవలెననియు, అందుకు దగిన ఆందోళన సాగించవలెననియు ప్రస్తావించి, నన్ను