పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/225

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


గావున కొందరికి జంకుకలిగెను. అదివరకు రాజకీయసభలకు బోకుండువారికి మరింత వ్యాకులతకల్గెను. నేనాతీర్మానమును గూర్చి విమర్శించుచు ఆంధ్రుల పౌరుషధైర్యసాహసములును, యుద్ధనైపుణ్యమును పూర్వరాజన్యులకాలములోను ఆంగ్లేయసైనికప్రచారములలో సహితము ప్రస్ఫుటములై యున్నవనియు ఎవ్వరో యొక సేనాని పాక్షికబుద్ధితో వ్రాసినవ్రాతల నాధారముచేసుకొని ముందువెనుకలు యోచించకుండ చేసిన నిషేధపుటుత్తరువు న్యాయవిరుద్ధమేగాక మొక్కబోవని శౌర్యవీర్యదర్పములుగల ఆంధ్రజాతిని సైనికదళములలో జేర్చరా దనుట కేవలము వివేచనారాహిత్యమును ప్రకటించుచున్నదనియు, బక్క బాపడనైన నేనుగూడ రణరంగమున అప్రతిమానప్రతాపమును ప్రకటింతుననియు వీరావేశముతో పల్కినపల్కులకు మహాసభలో కరతాళధ్వనులు మిన్నుముట్ట చెలరేగెను. మిత్రు లనేకులు నన్ను అభినందనవాక్యములతో ప్రస్తుతించిరి. విజయనగర కళాశాలాధ్యక్షులగు కిళాంబిరామానుజాచార్యులుగారు నా యొద్దకు వచ్చి, తమ యానందమును వెలిబుచ్చిరి.

ఇట్లు సభ లన్నియు ముగిసినపిదప ఇండ్లు చేరితిమి. కొలదిదినములకు గుంటూరులో న్యాయవాదిగా నుండి మునిసిపాలిటీకి అధ్యక్షులుగా కొంతకాలము పనిచేసి పట్టణములో పలుకుబడిగలిగిన శ్రీ వింజమూరి భావనాచార్యులుగారి యింటి యొద్ద కొందరు యువకులు చేరి నాకు కబురంపిరి. శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణగారును, చల్లా శేషగిరిరావుగారును, జొన్నవిత్తులగురునాధముగారును అక్కడ హాజరైనవారిలో ముఖ్యులు.