పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/213

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మునిసిపాలిటీ రద్దుపరచబడిన దను అపకీర్తి పొందవలసివచ్చునేమో యను భయము మాకు కలిగెను. మునిసిపల్‌రికార్డులు పరిశీలించినయెడల రద్దుపరచవలసినంత దోషములు కనుపడవు. కావున లోగడ రికార్డు లన్నియు చదివి, ప్రభుత్వముచేసిన యాక్షేపణల కన్నిటికి సమాధానములతో నివేదిక వ్రాయవలసిన బాధ్యత నాపై బడుటచే కొన్నిదినములు తదేకదీక్షగా నివేదిక తయారుచేసితిని. అప్పుడు గుంటూరు డిప్యూటీ కలెక్టరుగా నున్న శ్రీ జయంతి రామయ్యపంతులుగారు మాకు విశేషముగ తోడ్పడిరి.

ఈ జయంతి రామయ్యపంతులుగారు న్యాయదృష్టియు సమర్ధతయుగలవారు. శాసనములు చదువుటయందు సమర్ధులు. ఆంధ్రసాహిత్యమునెడ దేశచరిత్రమునందు మిక్కిలి అభిమానము కలవారగుటచే తాము ఉద్యోగము చేసిన జిల్లాలలో శాసనములను బయలుపరచి వాని ప్రతులను ఆర్కియాలజికల్ శాఖకు పంపుచుండిరి. ఆంధ్రసాహిత్యసంఘమునకు కొంతకాలము అధ్యక్షులుగ నుండిరి. శ్రీ పిఠాపురముసంస్థానాధీశులు సాగించిన ఆంధ్రనిఘంటుప్రయత్నమున వీరే ప్రోత్సాహకర్తలు. ఆనిఘంటు విచారణకర్తలుగా గూడ నుండిరి. చెన్నపురిప్రెసిడెన్సీమాజస్ట్రేటుగా గూడ పనిచేసిరి. వీరు ఆంధ్రదేశములో పేరెక్కిన ప్రముఖులు. వారు నాయెడ కొంత అభిమానము జూపుచుందిరి.

నేను తయారుచేసిన నివేదికను రామయ్యపంతులుగారు బలపరచుచు ప్రభుత్వమునకు నివేదిక పంపుటతో ప్రభుత్వము