పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/212

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


చాలమంది వైశ్యవర్తకులు వోటర్లుగా నుండుటచే ప్రత్యర్థియైన వైశ్యప్రముఖుడే జయమునొందెను. కొలదికాలమునకు అరండల్‌పేట స్థానము ఖాళీ పడినది. అంతకుమున్ను సభ్యులుగా నున్న ఏకా రామయ్య పంతులుగారు మంచి పలుకుబడికలవారు. నాయడ అభిమానముగలవారు. నన్ను తమస్థానమున నుండుమని ప్రోత్సహించిరి. అందుకు సమ్మతించి అభ్యర్థిగ నిలచితిని. ప్రత్యర్థు లెవరును లేరుగాన సభ్యత్వము సుకరముగ లభించెను. శ్రీ పి. వెంకటరెడ్డిగా రను వైశ్యులు మునిసిపల్‌సంఘమునకు అధ్యక్షుడుగ నుండిరి. ఆయన గుంటూరు క్రైస్తవకళాశాలలో ఉపాధ్యాయులు. అంతకుముందు వైశ్యు లెవ్వరు నాపదవి నలంకరించలేదు. కాబట్టి పలువురు పట్టుబట్టిఆస్థానము ఆయనకు లభింపచేసిరి. ఆ ప్రయత్నమున నేను కొంత పాల్గొంటిని. న్యాపతి హనుమంతరావుగారు సహాయాధ్యక్షులుగా నెన్నుకొనబడిరి. హనుమంతరావుగారు సహజశ్రద్ధతో పనులు నిర్వహించుచుండిరి. రానురాను వెంకటరెడ్డిగారు ఇతరవ్యాసంగములలో బడి అధ్యక్షధర్మముల నుపేక్షచేసిరి. మునిసిపాలిటీపనులు చాల దురవస్థలోనికి వచ్చెను. ప్రభుత్వము మునిసిపాలిటీని ఏల రద్దుచేయకూడదో సంజాయిషీ ఇయ్యవలసినదని ఉత్తరువుచేసిరి. ఆసందర్భమున హనుమంతరావుగారు ఛైర్‌మన్ డెలిగేటుగా నియమింపబడిరి. అప్పుడు నేను సహాయాధ్యక్షపదవికి సంబంధించినపనులు నెరవేర్పవలసివచ్చెను. ఈమార్పు లన్నియు ప్రభుత్వపు టుత్తరువు వచ్చుననగా ఏర్పడినను లోగడకాలమున జరిగినలోపము లన్నిటికిని మేమే బాధ్యులమైనట్లు తెలియనివారు తలంచుటయే గాక మాకాలములోనె