పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/207

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


పోయి, ద్వారదర్శనము చేయగలిగినందుకు మాతండ్రిగారు మిక్కిలి సంతసించిరి. స్వామిని ఎంత దర్శించినను తృప్తిలేకుండెను. ఎవ్వరో యొక ఉదారపురుషుడు ఆయనను తన చేతులతో పట్టి లేవనెత్తి దర్శనము చేయించెను. రామేశ్వరములో పదిదినములు నిలచితిమి. ఒకనాడు మధ్యాహ్నము భోజనమైనపిదప ఆ రామేశ్వరము దీవియగుటవలన మే మున్న తీరమువైపుగాక మరియొక తీరమువైపు పోవలెనని యుద్దేశించి యొంటరిగనే ఒక రోడ్డువెంట నడువసాగితిని. కొంతదూరము పోయినపిదప నొక ప్రక్కను చెట్లు గుబురుగా నున్న యడవి కనుపడెను. అం దొక కాలిదారిని బట్టి కొంతదవ్వు పోవునప్పటికి గొప్పయెడారి పొడసూపెను. అందు పెద్ద యిసుకతిన్నెలు గానవచ్చెను. అం దొక తిప్ప నెక్కి నలుప్రక్కలు బరికింప మానవు లెవ్వరును గానరారైరి. అప్పటికి భానుబింబము పశ్చిమాద్రిని గ్రుంకుచుండెను. దూరమున శ్రీ రామేశ్వరదేవాలయశిఖరము బంగారు రేకులు పొదగబడియున్నందున ఆసాయంసంధ్యాతపమున తళతళమెరయుచుండెను. ఆయెడారిలో నిర్జనప్రదేశమున నేకాంతముగ నుండుటచే కొంచెము గుండె జంకుబారెను. గాని అంతలో దైర్యము బూని సర్వత్ర వ్యాపించియున్న పరమేశ్వరుని ధ్యానించి పరవశుడనై బిగ్గరగ "దేవా పరమేశ్వరా" యని పిలిచి నమస్కరించి సంతసించితిని. అంతట తృటికాలమున కలిగిన ఆనందానుభవమును జ్ఞాపకముతెచ్చుకొనుచు వచ్చిన దారినే అడవిలో నడిచి బసకు చేరితిని. అపూర్వమగు ఆ మహదానందమును నేను పిమ్మట రచియించిన "శ్రీవేంకటేశ్వరానందలహరి" యను పుస్తకములో వర్ణించితిని.