పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నొక్కరాష్ట్రమున నొక్కపరిపాలనలో నుండుటయే ధర్మమనియు, అట్టి ఐక్యము జాతియొక్క సర్వతోముఖాభివృద్ధికి దోహదము కల్పించుననియు ప్రకటనగావించిరి. బంగాళాదేశ విభజన మార్చి, హిందీభాషాప్రచారముగల ప్రాంతమును బీహారురాష్ట్రములో జేర్చి, బంగాళాప్రజలకు ప్రత్యేక బంగాళారాష్ట్రనిర్మాణము గావించిరి. మరల దేశమున శాంతి సమకూడెను. స్వదేశోద్యమము మెల్లమెల్లగ వెనుకడుగు వేయసాగెను. కాని హార్డింజిమొదలగువారు ప్రచురణచేసిన భాషాప్రయుక్త రాష్ట్రసిద్ధాంత వచములు దేశమున వ్యాపించెను. ముఖ్యముగ ఆంధ్రదేశమున అందున గుంటూరులోని ఆంగ్లేయ విద్యాధికులగు యువకులహృదయముల నాకర్షించెను. ఈ చెన్న రాజధానిలో ఆంధ్ర - కర్ణాటక - తమిళ - కేరళభాషలు నాలుగు ప్రచారములోనుండినను ఇట్టి ప్రత్యేకప్రాంతముల నన్నిటి నొక్క రాష్ట్రమున గూర్చి ఒక్క పరిపాలనచట్రమునందు చేర్చుటచేత పరిపాలనాసౌష్ఠవము లోపించి, మిక్కిలి అసౌకర్యముగ నుండుటచేత, ఆయాప్రాంతములందు వసించు ప్రజల అభ్యుదయమునకు పలువిధముల ఆటంకము కలుగుచున్నది. కావున ఈ వివిధభాషా ప్రాంతములను వివిధరాష్ట్రములుగ నిర్మాణముచేయుట అవసరమను విషయము మాటిమాటికి వారు చర్చింపసాగిరి.

ఇంతకు బూర్వమే నేను బందరునుంచి గుంటూరు చేరితిని. పిదపగూడ కృష్ణాజిల్లాకాంగ్రెసు సంఘముక్రిందనే గుంటూరు జిల్లాకాంగ్రెసువ్యవహారములు నడుచుచుండెను. జిల్లామహాసభ యొకటి నరసరావుపేటలో నడిచినది. అప్పుడు నేనే అధ్యక్షు