పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ములు. వీరిలో పలువురుదీక్షాపరులు, ఆస్తికులు, గౌరవపాత్రులు నుండిరి. విద్యార్థిగా నున్నపుడు పండితశివనాధశాస్త్రిగారి ఉపన్యాసములు వింటిని. నిర్మలచిత్తముతో పరమేశ్వరుని ధ్యానమొనర్చుచు అన్నిటికిని ఆయనయందే భారముంచి ప్రవర్తించుట పరమధర్మమని వారు వక్కాణించిరి. అందువలన కొఱతలేక జీవితము సాగగలదని బోధించి, అట్టి నిరతిశయ భక్తిప్రపత్తుల వలన కలుగు ఫలితమునకు స్వీయానుభవములను దృష్టాంతముగ పేర్కొనిరి. శశిపాదబెనర్జీ, హేమచంద్ర సర్కారుల సంభాషణలుగూడ నేను వింటిని. శశిపాదబెనర్జీగారు తొంబదిసంవత్సరముల వృద్ధులుగా నున్నపుడు కలకత్తాలోనే దర్శించి వారు ఋషికల్పులని భావించితిని. సీతానాదతత్త్వభూషణులు మహాపండితులు. వీరు శంకరసిద్ధాంతమునందలి మాయావాదమును ఖండించి, రామానుజుల సగుణతత్త్వమునే అంగీకరించి, నిర్గుణతత్త్వమును నిరసించిరి. శంకరుని నిర్గుణసిద్ధాంతమున భక్తిప్రపత్తుల కవకాశము లేదని వారి వాదము. ఈవిమర్శ కిందు స్థానములేదు. గాని నేను వ్రాసిన 'బ్రహ్మవిచార'మను పుస్తకమున ఈవిషయమైన చర్చలు వలయువారు చదువగలరు. మన ప్రాంతమున ఈ బ్రాహ్మమతమునవలంబించినవారిలో శ్రీ వేంకటరత్నంనాయుడు, వీరేశలింగముగార్లను గూర్చి ప్రశంచింతిని. నాయుదుగారు పిఠాపురము జమీందారుగారైన సూర్యారావుబహద్దరువారికి గురుప్రాయులుగ నుండి వారిచే అనేకసత్కార్యముల నొనర్పజేసిరి. ఆజమీందారుగారు బ్రహ్మసమాజమునందు అభిమానముకలవారయ్యు వారిసంస్థానమున నవరాత్రములలో వేదాధ్యయనపరులకును శాస్త్రజ్ఞులకును