పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గూడ భోజనముచేయుచుండిరి. మధ్యాహ్నము కొంతవడి విశ్రమించి, చల్లబడినపిదప పాతగుంటూరు నడచిపోయి మరల సాయంకాలము ప్రొద్దు గ్రుకునప్పటికి అగ్రహారము వచ్చి, భోజనమైనపిమ్మట అప్పుడు మాయింటిలో నున్న దూరపు బంధువు మద్దులూరి చెన్నకృష్ణమ్మగారిని తోడుతీసుకొని చీకటిలోనైనను కాలినడకనే పాతగుంటూరు పోవుచుండిరి. చెన్నకృష్ణమ్మగారుమాత్రము ఉదయముననే తిరిగి వచ్చుచుండెను. ఈ చెన్నకృష్ణమ్మగారు మా అత్తవారింటిలో కొంతకాలము మగదిక్కుగా నుండిరి. మేము బందరులో నుండగా మాతోడనే యుండి, వంటమొదలగుపనులలో పాల్గొనుచు మాకు మిక్కిలి సహకారిగానుండెను. కొన్నిసంవత్సరములు హైదరాబాదులో తమ్మునియొద్ద నుండెనుగాని అచ్చట తనకు సుఖముగ జరుగక కాబోలు మరల నాయొద్దకే వచ్చిచేరెను. ఈయన వంటలో కడునేర్పరి. అత్యంతభోజనప్రియుడు, బలశాలి. దూరమునుండి గుండిగతో నీళ్ళు నెత్తిపై నిడుకొని వచ్చెడివాడు. తనకు తగినట్లు భోజనముకుదిరినయెడల దానితో సంతుష్టిచెందెడివాడు. కాని, ఆయనను సామాన్యులు భరింపజాలరు. ఆయనకు షడ్రసోపేతముగను సంతుష్టిగను భోజనవసతి జరిగెడిచోటనే గాని మరొకచో నుండజాలడు. ఆయన చనిపోవువరకు మా యింటనే ఇరువదిసంవత్సరములకాలము మమ్ములను కనిపెట్టుకొనియుండెను. ఆయన ఇంచుక స్థూలశరీరి. వైష్ణవనామములు ముఖమునమాత్రమేగాక రెక్కలమీదను ఎదురురొమ్ముమీదను నిండుగ ధరించుచుండెను. శ్రీవైష్ణవుడని, హెచ్చుగా వైష్ణవ ప్రతిపత్తిగలవాడని తెలియనివా రనుకొనుచుండిరి. దేవతార్చన