పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేసి నిదురించుచుండిరి. వంటయింటిలో మాతండ్రిగారుభోజనము చేయుచుండిరి. అప్పటికి మూడుగంటలై నందున ఇంత ఆలస్యముగ భోజనముచేయుచున్నా రేమని ప్రశ్నించితిని. వారు మారుపలుకకుండిరి. ఇంత ప్రొద్దుపోయిన దేమని మామేనత్తగారి నడిగితిని. "ఏమని చెప్పను, ఎంత పెద్దవాడైనను ఆయనబాధ తప్పించెడివారెవ్వరును లేరు, పొలములో ధాన్యము కైలు చేయించుటకు ప్రొద్దుటనే పోయి ఇప్పుడే వచ్చె"నని ఆమె కండ్ల నీరుగార్చుచు చెప్పెను. నాకు దు:ఖము పట్టరాకుండెను. మా తమ్ములమీద కోపమును అధికమయ్యెను. అందరు తిని, పోతరించి యధేచ్ఛగ ప్రవర్తించుటేగాని పెద్దలైన తండ్రిగారి కష్టము గనిపెట్టకపోవుట అన్యాయమని గట్టిగ పలికి పిమ్మట మానాయనగారితో నిట్లంటిని. "ఇంకను మీ రిట్టి కష్టములు పడుట నేను సహింపలేను. రేపటినుంచి మీరు పెద్దలు ఉభయులును నాయొద్దకు వచ్చి నాపోషణలో నుండి, నాచేత సేవగొనుచుండవలెను. ఆప్రకారము మీరు చేయనియెడల నేను నావృత్తినైన మానుకొని ఇక్కడనే ఉండెదను. మీరు రేపు నాయొద్దకు రానియెడల మరల రేపు తప్పక వచ్చెదను. నాశపధమును నేను తప్ప"నని నాదు:ఖార్తిని వెలిబుచ్చితిని. వారు మారుపలకక ఊరకుండిరి. నేను మీరు తప్పక రావలయునని మరి రెండుమారులు స్పష్టముగ చెప్పి సాయంకాలమునకు అగ్రహారమునకు చేరితిని. మరునా డుదయమున మాతండ్రిగారు మాత్రము నాయొద్దకు వచ్చిరి. మా మేనత్తగారు రాలేదు. అప్పటినుండి మాతండ్రిగారు ప్రతిదినము ఉదయమున స్నానసంధ్యాదికములు తీర్చుకొని నా భోజనవేళకువచ్చి నాతో