పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాలమునకు ఒకపూట జొన్నఅన్నమో వరిగఅన్నమో తినుచు రెండవపూట వరియన్నము తినుట బ్రాహ్మణులు, వైశ్యులు మున్నగు వారిలో ప్రారంభమయ్యెను. రయితులు శిస్తు చెల్లించుటకు డబ్బు దొరకక చాల కష్టపడుచుండిరి. కొన్నిచోట్ల శిస్తులు చెల్లించని వారిని ఎండలో నిలబెట్టి వీపుపై బండలు పెట్టి బాధించి శిస్తు వసూళ్ళుచేయుచుండుట సాధారణముగ నుండెను. ఈ అభ్యాసము కొన్నిచోట్ల దారుణముగ నుండుటచే చెన్నపట్టణములో రాజకీయములకు దారిజూపిన గాజుల లక్ష్మీనరసింహ చెట్టిగారును, శ్రీ రంగయ్య నాయుడుగారు మొదలగు ప్రముఖులు కలసి గవర్నరుగారికి మాత్రమేగాక లండనులో పార్లమెంటువారికి గూడ మహరులను నంపి ఈ దురభ్యాసము మాన్పించుటకు గొప్ప ఆందోళన గావించి, తుదకు కృతకృత్యులైరి. ప్రజలు చాల విద్యా విహీనులుగనే యుండిరి. బ్రాహ్మణులలో మాత్రము పలువురు చదువను వ్రాయను లెక్కలువేయను నేర్చియుండిరి. కాని భాషా పాండిత్యము కలవారు అప్పటికే దేశమున నరుదుగా నుండిరి.

నేను పుట్టిన కాలమున ఇప్పటి గుంటూరులో పాత గుంటూరు అని పిలువబడు భాగము మాత్రము ప్రధానముగ నుండెను. అది అప్పటికి చిరకాలమునుండి సంస్థానాధీశులగు వాసిరెడ్డి వారికిని, మానూరి వారికిని ముఖ్య స్థానముగ నుండెను. వాసిరెడ్డివారి కోట పెద్దది. యొకటి యూరి మధ్యను, మానూరివారి కోటలు రెండు దక్షిణభాగమున నుండెను. ఆ సంస్థానములు అధికారములు కలిగి భాగ్య