పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/176

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


పోదలచిన నేను ఈవిషయమై వివాదముపెట్టుకొనుట సరికాదనియు తలచితిని. నాకంటె హనుమంతరావు తెలివిగలవాడనుట నిశ్చయమే. నేనును జాగ్రత్తగనే పనిచేయుచు కక్షిదారులయు న్యాయమూర్తులయు అభిమానమును కొంత సంపాదించుకొంటిని. ఏది యెట్లున్నను మా ఇర్వుర చిరకాలస్నేహబంధము మహాభాగ్యముగ నేను తలంచి దానికి భంగముకలుగు మాటలుగాని చర్యలుగాని జరుపకుండ ప్రవర్తించుచుంటిని. మేము జాయింటుగా పనిచేయుకాలములో నేను పరగ్రామమున నుండవలసివచ్చినపుడుసహితము ఆయన యొక్కడే పనిచేసి ఆర్జించినసొమ్ములో నేను సగభాగము తీసికొన్నను ఆక్షేపించలేదు. ఆయన బాపట్లలో డిస్ట్రిక్టుమునసబుపని ఒకమాసమో రెండుమాసములో చూచుచున్నపుడు నే నొక్కడనే పనిచేసినప్పుడు వచ్చిన ఫీజులో ఆయనభాగము తీసికొనెను. నేను సాంఘికములు, రాజకీయములునగు కార్యములలో నెక్కువ ప్రవేశించుచుంటిని. హనుమంతరావు అనివార్యమైనపుడు తప్ప అట్టి పనులలో జోక్యముకల్గించుకొనువాడు గాడు. అట్లయ్యు నా ఈ అన్యవ్యాపృతి నాయన ఆక్షేపించియుండలేదు.

నేను అధ్యక్షుడుగ, వక్తగ నుండిన సభలలో ఆంగ్లేయభాషలోనే ప్రసగించుచుంటిని. ఉత్సాహము హెచ్చుగా నున్నపుడు ఇంగ్లీషులోఉపన్యాసము పలువుర నాకర్షించునట్లు చేయగలిగినను సామాన్యముగ నా ప్రసంగము లంత సౌష్టవముగ, హృద్యముగ నుండెడివికావు. నాతో సమానులును నాకంటె కొంత వెనుక బడినవారు నుండెడిసభలో కొంత పటుత్వముగ భాషణచేయు