పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ్రాయుట వారికి విహితమగు నియమపద్ధతి నతిక్రమించియున్నను డిప్యూటీమాజస్ట్రేటు పండిత నాగేశ్వరరావుగారు ఆప్లీడర్లువ్రాసినట్లు "నిరంకుశముగను, ద్రోహబుద్ధితోడను ప్రవర్తించినా"డనుట నిశ్చయము గాన ఇట్టి సందర్భములో ప్లీడర్లపై ఎట్టి చర్యను జరుపనవసరములేదు. వారిపై మాజస్ట్రేటు వేసిన ఉత్తరువును రద్దుపరచితి"మనిరి. మరియు ఆసామికి చోరీనేరముక్రింద వేసినశిక్ష రద్దుపరచి, ప్లీడర్లమీద న్యాయవాది చట్టముక్రింద విచారణ చేయనక్కరలేదు అని తీర్పుచెప్పిరి.


బందరు నుండి వీడ్కోలు

ఈ నాగేశ్వరరావుగారితో సంబంధించిన వ్యవహారమునకు ముందే నామిత్రులు చన్నాప్రగడ భానుమూర్తిగారును, నేనును ఒకయింటిలోనే కాపుర ముండుట తటస్థించెను. ఈ కారణమున మామైత్రి గాడమాయెను. మాఆడవారికి, వారి ఆడవారికిగూడ స్నేహమయ్యెను. వల్లూరి సూర్యనారాయణరావుగారును ఆ సమీపముననే కాపురముండిరిగాన వారి కుటుంబముతోగూడ మావాండ్లకు మైత్రికుదిరెను. వేసవిసెలవులలో నాకును భానుమూర్తిగారికిగూడ తీరికయే. ప్రతిదినము ఉదయమున ఆయన యింటిపెరటిలో పాదులు త్రవ్వి, అరటిమొక్కలును, పూల మొక్కలును నాటి, నీళ్లుపోసి పెంచుచుండెడివారు. గొడ్డలితో కట్టెలు చీల్చుచుండెడివారు. చెట్లెక్కి దిగుచుండెడివారు. స్వత: బలిష్ఠకాయులు గాన అట్టి వ్యాయామము వారు చేయగలిగి యుండిరి. నేను అంతటి బలువగు వ్యాయామముచేయలేక అరటి