పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/170

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ధానముగ తెలియపరచెను. మొత్తమున తొందర లేదనునది ఆయన మాటలవలన మాకు తోచెను.

పదునొకండుగంటలకు హైకోర్టులో శ్రీ సుబ్రహ్మణ్యము, బోడాముగార్లకోర్టుకు చేరితిమి. మొట్టమొదట నార్టనుకు సంబంధించిన జమీందారీఅప్పీలు తీసుకొనబడెను. నార్టను వాదన సాయంకాలము అయిదుగంటలవరకు సాగించినందున మా వ్యవహారము మరల వాయిదాపడునట్లు కనుపించెను. మాలాయరు గారు మనవిచేయగా మరునాటికే వాయిదావేయబడెను. మరియొకసారి రికార్డు అంతయు చూచి, అందలి ప్రతివిషయమును పూర్ణముగ కృష్ణసామయ్యగారు ఆకళింపుచేసుకొనిరి.

మరునాడు మా వ్యవహారము మొట్టమొదటనే న్యాయమూర్తులు చేపట్టిరి. కృష్ణసామయ్యగారు అర్జీవిషయము మొదటనే ఎత్తుకొన "ఈ వ్యవహారమున పూర్వరంగము కొంత కలదు. అది ముందు మనవిచేయుదు"నని అనుమతిపొంది, అనగ ననగ నొకరాజు అన్నట్లు కధారంభముచేసి, పశువుల కడ్డముపోయిన ఆసామికి చోరీనేరముక్రింద శిక్షవిధించుటమొదలు ఆ ఆసామిని చెరలోబెట్టి నూరురూపాయలు లంచము పుచ్చుకొనుటయు, అవనిగడ్డ మేజస్ట్రేటుమీద లంచగొండి యని మహజర్లు కలెక్టరుకు పోవుటయు, అందుపైనవిచారణ, రిపోర్టు, నాగేశ్వరరావుగారి పక్షపాతము, చోరీకేసువిచారణలో అవనిగడ్డ మాజస్ట్రేటుతీర్పును ఆయన ఖాయపరచుట, మహజర్లవిచారణ నాగేశ్వరరావుచేతబడుట, ఆకస్మికముగ ఆ ఆసామిని పట్టుకొని