పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/17

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


జననము - దేశస్థితి

నేను గుంటూరు పురమందొక బ్రాహ్మణ కుటుంబమున జనన మొదితిని. నా జన్మదినము ఎనుబది రెండేండ్ల క్రిందటి క్రోధననామ సంవత్సర మాఖ బహుళ సప్తమి. అనగా భారత దేశ ప్రధమ స్వాతంత్ర్య సమరము నడచిపోయిన తొమ్మిది యేండ్లకు. అది క్రైస్తవశకము 1866 సంవత్సరము ఫిబ్రవరి 2 వ తేది యగుచున్నది. అంతకుముందు యుద్ధములు, పిండారీ మూకల దోపీడులు మొదలగు నలజడులచే కలతనొందిన దేశమునందు కొంత శాంతి నెలకొల్పబడినది. ఈ ప్రాంతము పూర్వకాల హైందవ ప్రభుత్వముల క్రిందనుండి, పిమ్మట మొగలాయి రాజ్యములో చేరిన హైదరాబాదు సంస్థానములో నైజాము యొక్క పరిపాలనలో నుండెను. యుద్ధములో నోడిపోయిన నైజాము ఈ దేశమును కొలదికాలము క్రిందటనే ఆంగ్లేయుల కిచ్చివేసెను. కాని మొగలాయి సాంప్రదాయములు ప్రజల నింకను బూర్తిగా విడువలేదు.

ఆంగ్లేయులకును నైజామునకును జరుగుచుండిన కలహముల మధ్య బుస్సీయను ఫ్రెంచి సేనాపతి కొంత సేనతో యీ ప్రాంతముపై దాడివెడలి భయంకర యుద్ధప్రచారము సాగించి యుండుటచేత ప్రజలు మిక్కిలి కలవరము నొందిరి. కావుననే ఆ బూసి సేనానిపేరు మరవక ఇప్పటికిని పోరుబెట్టు బిడ్డలను బూచివాడు వచ్చుచున్నాడని భయపెట్టి ఏడ్పుమాన్ప ప్రయత్నించు చున్నారు.