పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గూడ పడినది. నార్టను అను సుప్రసిద్ధ క్రిమినల్‌బారిస్టరును చూచి సంగతులు తెలిపి మాపక్షమున పనిచేయుడని కోరగా రు 500/- ఫీజు కోరిరి. అందుకు సమ్మతించితిమి. మా రికార్డు కూడ యిచ్చితిమి. సొమ్ముమాత్ర మీయలేదు. శుక్రవారము రాత్రి బయలుదేరి తాను తంజావూరులో శనివారమునాడు పని చూచుకొని ఆదివారము ఉదయము మరల పట్టణమునకు వచ్చెదననియు, ఆరోజున మాతో రికార్డు చదివెదననియు, ఈమధ్య అవకాశము కల్గినపుడు రికార్డు చదివెదననియు వాగ్దానము చేసెను. ఆప్రకారము ఆదివారము ఉదయమున కలిసికొనగా భోజనముచేసివచ్చినతోడనే చదివెదనని చెప్పెను. మే మిర్వురము శ్రీ రెంటాల వెంకటసుబ్బారావుగారి ఇంటిలో భోజనము చేసి సుబ్బారావుగారితోగూడ నార్టన్‌గారిబంగళాకు చేరితిమి. అప్పటికే ఆయన ఏదో జమీందారీకేసురికార్డు చదువుచున్నట్లును కొంచెము తాళినయెడల మా రికార్డు చదువుననియు గుమస్తా చెప్పినందున మేము వెలుపల చెట్లక్రిందనే యుంటిమి. ఎంత వేచియున్నను జమీందారుకేసురికార్డే చదువుచుండెను. లోపలికి కబురంపి నపుడెల్ల ఇదిగో నదిగో ననుజవాబులే గుమస్తా చెప్పుచుండెనుగాని లాయరుగారు మారికార్డు చదివే అవకాశము కనబడలేదు. విసుగుబుట్టి వెంకటసుబ్బారావుగారు వెడలిపోయిరి. మేమిరువురము ప్రొద్దుజారిపోవుచున్నకొలది వ్యాకులచిత్తులమగుచుంటిమి. ప్రొద్దు తూలిపోయినది. రేపే విచారణకదా రికార్డు చదువుట కవకాశము లేదుగదా, ఏమి చేయదలచినారో గట్టిగా తెలుసుకొనవలసినదని గుమస్తాను బలవంతపెట్టగా ఆయన లోనికి బోయి వచ్చి మరియొక రోజుకు