పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/160

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


జ్ఞాపకములేవు. కలకత్తానుండి జగన్నాధమును రాత్రి పండ్రెండుగంటలకు చేరితిమి. అచట దేవాలయములోపల జగన్నాధసుభద్రాబలభద్రుల విగ్రహములు మూడును వరుసగ ఎత్తగు వేదికపై నిలువబెట్టియున్నవి. ఆ వేదికచుట్టును భక్తులందరు ప్రదక్షిణమొనర్తురు. బంగాళీయులును, ఉత్కళులును భక్తిపరవశులై పాటలుపాడుచు ప్రదక్షిణముచేయుదురు. ఈస్వామికి జాముజామునకు వంటకములు నివేదింతురు. ఈ వంటకములు కుమ్మరులు వండి, కావళ్లమీద దేవాలయము లోపలికి గొనిపోవుదురు. ఇవి స్వామికి నివేదనమైన పిమ్మట భక్తులకు అమ్ముదురు. ఈ ప్రసాదమును అన్ని కులముల వారును సేవింతురు. మేమును ఆప్రసాదమును కొని కొద్దిగా సేవించితిమి. కాని మాతోడి బ్రాహణకుఱ్ఱవాడు కండ్ల నీళ్ళుబెట్టుకొని అతికష్టముతో ఆప్రసాదమును స్వీకరించెను.

ఇంటికి జేరినపిమ్మట తిరునారాయణస్వామినిగూర్చి విచారణసేయగా ఏలూరుకాపురస్థులు మోతేగంగరాజుగారు మొదలగువారు తోడైనందున వారితో బనారసు కలకత్తాల మీదుగా ఇల్లుచేరినట్లు తెలిసినది. ప్రయాణములో నెన్ని విశేషములు చూచినను, ఎన్ని అనుభవములు కలిగినను, స్వేచ్ఛగా ఆకాశమున ఎంతో దూరము విహారముచేసిన పక్షి మరల గూటికి చేరినట్లు, నేను ఇంటికిచేరి, మామూలు వృత్తికార్యములు నడుప జొచ్చితిని. యాత్రలలోని నూతనానుభవముల జ్ఞానము కొంత విశాలదృష్టి కల్పించుటకు కారణమయ్యె నని తలంచుచున్నాను.