పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/158

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ప్రయాణమునకు నన్ను బెజవాడలో కలిసికొందునని చెప్పిన ఈ మిత్రుడు ఇప్పటికి మరల తలవనితలంపుగ నిట్లు కంటబడెను. ఆయన మరికొందరు బెంగుళూరువారితో కలసివచ్చెను. వారితో గలసి, పట్టణములోనికి బోయి వారి స్వహస్తపాకమున చేరితిని. వంకాయబజ్జితో స్వయంపాకము చేసుకొని భుజించితిని. అప్పటికి అన్నము దిని పండ్రెండురోజు లయినందున ఆవంకాయబజ్జి అమృతప్రాయమై తోచెను. పిమ్మట వారు మధుర, బృందావనము మొదలగు తీర్ధయాత్రల కరిగిరి. నేను కాశీ, ప్రయాగ, కలకత్తా జగన్నాధముల సేవింప క్రొత్తమిత్రులతో కలసి పయనమైతిని. కాశిలో గంగాస్నానముచేసి విశ్వనాధుని దర్శనము చేసితిమి. విశ్వనాధాలయము చిన్నదియైనను సుందరముగనే కట్టబడినది. విశ్వనాధుని లింగము ఒక సావడిలో వెండిరేకు పొదిగిన నేలతొట్టికి మధ్య నున్నది. ఈ లింగము దగ్గర పూజారియొకడు దుప్పటికప్పుకొని, తలగుడ్డతో కూర్చుండెను. మడిమొదలగు మర్యాదలుగాని మంత్రములుగాని లేనందున విపరీతముగ గానుపించెను. యాత్రికులు కులవివక్షలేక, మంత్రసహితముగ అభిషేకముచేయగలవారు క్లుప్తముగ మంత్రముచెప్పి, స్వయముగ లింగమును తాకి, అభిషేకముచేసి, పత్రములు పూవులు లింగముపై బెట్టి, తొట్టిలో దక్షిణలు వేసి పోవుచుండిరి. ఇతరులు లింగముమీద నీళ్ళుపోసి చేతులతో లింగమును ముట్టుకొని కండ్లకద్దుకొని పూలు సమర్పించి పోవుచుండిరి. ఇట్లు కులభేదములు పాటింపక లింగమును స్వయముగ ముట్టుకొని ఆరాధించు నాచారము అసాధారణమైనను గొప్ప సంతుష్టి కల్పించినది. శంభోశివ యని నామోచ్చారణచేయుచు