పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారతదేశపు రత్నములన్నిటి నొక్కచో రాశిబోసినట్లు చూపట్టెను. కాని ఈమహారాజు లందరు విదేశరాజప్రతినిధివెంట దాసులై పోవుట భారతదేశపుబానిసత్వముగూడ ఇచట రూపెత్తినట్లే కనుపించెను. ఈసంస్థానాధిపతులలో ముందుజంటలో నెవ్వరి నేర్పరచవలెననుప్రశ్న వచ్చినపుడు మైసూరు, ట్రావెన్కూరుప్రభువులను మొదటిజంటగా నిర్ణయించిరట. ఈవార్త నైజామునకు తెలిసి తాను మొదటివరుసలోనే ఉండవలెననియు అట్లుగానిచో ఉత్సవమున పాల్గొనననియు పంతముబూని స్వంత రైలుమీదనే డిల్లీకి వచ్చి రైలుస్టేషనులో తన బండిలోనేయుండి రాజప్రతినిధితో ఉత్తరప్రత్యుత్తరములు నడిపి, తుదకు ట్రావెన్కూరుమహారాజును రెండవవరుసకు దించి, తన్ను మొదటి వరుసలో చేర్చినపిమ్మట బండిదిగి పట్టణములో తనబసకు చేరెనని చెప్పుకొనుచుండిరి.

దర్బారుసమయమున ఈమహారాజు లొక్కొక్కరు లేచి మధ్యపీఠాసీనుడైయున్న రాజప్రతినిధియగు కర్జనుప్రభువు నొద్దకు జని, కానాట్‌ప్రభువు పరిచయము నొంది, ఆంగ్లప్రభుత్వముపట్ల తమభక్తిని ప్రకటించు ప్రమాణముసల్పుటకు నిర్ణయమయ్యెనట. అట్లు వారిస్థానములనుండి లేచి కర్జనుప్రభువు నొద్దకు మరలివచ్చుటలో వీపులు కర్జనుప్రభువువైపునకు త్రిప్పకుండ వెనుక వెనుకకు నడచిపోవలెనను నియమము నవలంబింప వలసియుండెనట. మహారాజు లందరును ఆప్రకారమే వారివారి స్థానములకు మెలమెల్లగ వెనుకవెనుకకే నడిచిరటగాని బరోడా మహారాజుగారు వీపు కర్జనుప్రభువువైపునకు త్రిప్పియే తన