పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/152

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఆకుపచ్చతలగుడ్డలు పెట్టుకొని పొట్టి టింగణాలపై సాగిపోయిరి. వారివెంట పెద్దగుఱ్ఱములపై నందమగు దుస్తులు ధరించిన బ్యాండువాయిద్యమువారు హృద్యముగ వాయించుచు వెడలిరి. పిమ్మట నొక వృద్ధగజరాజముపై బంగారునీరుపోసిన హౌదాయందు కర్జనుప్రభువును ఆయనసతీమణియును వెడలివచ్చిరి. సరిగపట్టెలుగల చిత్రవస్త్రములతో ఆభరణములతో నలంకరించిన ఈగజమున కిరుప్రక్కలను వెండికఱ్ఱలు బట్టుకొని వేత్రహస్తులు నడచుచుండిరి. ఈ ఏనుగు కాశీమహారాజుల వారిది. 1857 సంవత్సరమున విక్టోరియారాణీగారికి భారత చక్రవర్తిత్వము సిద్ధించినపుడు డిల్లీలో గావించబడిన మహోత్సవమునాడు ఊరేగిన మహాగౌరవము గాంచినదిగాన దానిని మరల ఆమె కుమారుని పట్టాభిషేకకాలమున ఊరేగింపులో రాజప్రతినిధిగ తానెక్కవలెనని కర్జనుప్రభువు పట్టుబట్టి రప్పించెనట. ఆ యుత్సవమునకు ఎడ్వర్డురాజుగారిసోదరుడు కానాట్ డ్యూకు భార్యాసమేతుడై మనదేశమునకు వచ్చెనుగాని రాజప్రతినిధియగు తానే ముందుబోవలెనని కర్జను శాసించెనట. అందువలన కానాట్ సతీమణితోగూడ గజారూడుడై వెనుక వచ్చుచుండ కర్జను తాను ముందు నడిచెను. కానాటు వెనుక గజములనెక్కిన మహారాజులు ఏబదిమంది జంటజంటలుగ వారి వారి చోప్‌దారీలతో మెల్లమెల్లగ బోవసాగిరి. వా రెక్కిన గజములును చిత్రాలంకృతములు గావింపబడియుండెను. వారును వంకరతలపాగల రత్నములుపొదిగిన కలికితురాయిల నమర్చి పట్టుచొక్కాయిలను తొడిగి మణిమయములగు కంఠహారములను, కంకణములను, భుజదండములను ధరించియుండిరి. ఆదృశ్యము