పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/15

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


దు:ఖదాయకముగ నుండెనాయని ఎవ్వరేని నన్ను ప్రశ్నించిన యెడల నిస్సందేహముగ సంతోషకరముగనే యున్నదని చెప్పగలను. సామాన్యముగ నెంత దుస్థితిలో నున్నవారైనను దీర్ఘజీవితులైనవారు సౌఖ్యమే యెక్కువగ ననుభవింతురని నా విశ్వాసము. ఏలననగా ప్రతిదినము నిద్దురతో శరీరక్లేశము తగ్గి ఉదయమున మేల్కాంచునప్పటికి దేహము పుష్టికరముగ తోచినట్లు అప్పటికప్పటికి కలుగు దు:ఖములును పిమ్మటి సుఖానుభవములచేత మాసిపోవును. దినదినమును నూతనానుభవములు కలుగుచుండుటచే జీవితము నూతనకళలతో నొప్పారు నొక నాటకరంగమువలె నుండును. క్రొత్త యనుభవముల సందడిలో ప్రాత దు:ఖములు మాసిపోవును. ఇంతకును సుఖదు:ఖముల మేరలు చాలవరకు వారివారి మనస్సులనుబట్టి యుండును. ఒకరికి ఎక్కువ సుఖముగ దోచు విషయము మరియొకరి కంతగా సుఖప్రదముగ నుండదు. అటులనే ఒకరికి దు:ఖకరముగ నుండునది మరియొకరికి అంతగ దు:ఖము కలిగింపక పోవచ్చును.

ఈ సుఖదు:ఖములు కొన్ని దేహమునకు, మరికొన్ని మనస్సునకు సంబంధించి యుండును. యమ నియమముల ననుసరించి జీవించినవారు సామాన్యముగ దేహారోగ్యము మొదలగు దైహిక సుఖముల ననుభవింతురు. నిర్మలవర్తనము కలిగి సత్యనిష్ఠతో ప్రవర్తించువారికి మన:క్లేశమునకు కారణము లుండవు. అనివార్యములగు విపత్తులు సంభవించినను ధైర్యముకలిగి సర్వమును పరమేశ్వరాధీనమను పరమార్థచింతనకలవారు దు:ఖములు పాటింపరు.