పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/149

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


దర్బారు స్థలమునకు చుట్టును ప్రహరీగోడ కట్టించి, దాని కొకప్రక్క కొంచె మెత్తుగ పెద్ద అరుగును కట్టించి దానిపై సంస్థానాధీశుల కలంకృతములగు పీఠము లమర్చిరి. మధ్యభాగమున మిక్కిలి సుందరమగు ఉన్నతాసనము నేర్పరచి, దిగువ వివిధ రాష్ట్రముల గవర్నరులు, నుద్యోగులు, శాసనసభ్యులును ప్రఖ్యాతి పురుషులు మున్నగువారికి ఉచితాసనము లమర్చిరి. ఇవి గాక ప్రేక్షకులకుగూడ అవకాశములు సమకూర్చిరి. ఒకనాడు పురవీధులలో గొప్ప ఊరేగింపు, ఇంకొకదినము కాల్బలములు, అశ్వదళములుగల అరువదివేలసేన ఒక్కసారిగ ప్రదర్శింపబడుట, మున్నగు కార్యక్రమములు ప్రకటితములైనవి. సభాస్థలమునకు చుట్టును పహరాలుబెట్టి అడ్డములు గట్టినందున వెలుపలివారలకు లోపల నేమియు కనుపడదు. అందు ప్రవేశమునకు ప్రేక్షకులకు టిక్కెట్లు ఇవ్వబడునని తెలియవచ్చినది. కాని ఈ టిక్కెట్లు ఎప్పు డెవ్వ రిచ్చెదరో తెలియదు. పంజాబు దేశస్థుడగు ఒక డిస్ట్రిక్టుమునసబుతో పరిచయము కలిగెను. ఆయనయు స్నేహపాత్రుడుగ నుండెను. టిక్కెట్టునిమిత్తము ఆయన ప్రయత్నము చేయుచున్నాడు గాన నాకు నొకటి సంపాదింతునని వాగ్దానముచేసెను. కాని తుద కాయనకు లభించుటచే దుష్కరమైనది. ఇట్లుండగా నే నుండిన బసలో క్రింద నున్న కొళ్ళాయి యొద్ద ముఖము కడుగుకొనుచుండగా "వీరే వెంకటప్పయ్య" అని యెవరో అనిరి. నే నాశ్చర్యముతో తిరిగి చూచునప్పటికి నా చిరకాలమిత్రుడు నంబూరి తిరునారాయణస్వామి కనబడెను. నే నున్న మేడక్రింది కొట్లలో ఏలూరినుండి వచ్చిన మిత్రులతోగూడ మూడుదినములుగా వంటలుచేసికొనుచుంటి