పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/148

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


క్రాగుచుండెను. ఒక అంగడిలో పాలును, అప్పుడప్పుడు చేసిన రొట్టెయును కొని గదికి తెచ్చుకొని భుజించి, మంచినీరు ద్రావి నిదురించి, కొంతసేపటికి మేల్కొని, పట్టణము చూడవలెనని గదితాళమువేసి బయలుదేరితిని. డిశంబరునెలలో నచట మిక్కిలి చలిగాన ఉన్నిలాగును, ఉన్నిషర్టును దట్టమైన ట్వీడ్ లాంగు కోటును, సరిగతలపాగయు, మెడకు ఉన్నికంఫర్టరును ధరించి, కాళ్ళకు ఉన్నిమేజోళ్ళును బూటులును తొడిగికొనియుంటిని. చేతిలో అందమగు చేతికర్ర యుండెనని జ్ఞాపకము. మరియు బంగారుగొలుసుగల వెండి జేబుగడియారమును కోటుజేబులో వేసుకొనియుంటిని. నాకు అప్పటి వయస్సు ముప్పదియారు సంవత్సరములుగాన దార్ఢ్యముతో కాలినడకనే మెల్ల మెల్లగ పోవుచుంటిని. పట్టణములో హస్తినాపురము అని యొకభాగమున, ఇంకొక భాగమున వీధులలో ఇంద్రప్రస్థ మని బల్లలపై వ్రాయబడి యుండెను. చాందినీచౌకు, జుమ్మామసీదు చుట్టుప్రక్కల దర్శనీయముగ నుండెను. పెద్ద మైదానములో ఇప్పుడు క్రొత్తఢిల్లీ కట్టిన స్థానముననే ఉత్సవము నిమిత్తము ఢిల్లీకి వచ్చెడి సంస్థానాధీశు లుండుటకు ప్రత్యేకస్థలము లేర్పరుపబడెను. బరోడామహారాజు కొయ్యపలకలతో రాజమందిరమువలె నొక కట్టడమును నిర్మాణము చేయించుకొనిరి. దానిని మరల ఊడదీసి మడతబెట్టి రైలుమీద వారి సంస్థానమునకు గొనిపోవుటకు వీలుగా నిర్మించిరి. రాకపోకలకు ఎఱ్ఱమట్టితో బాటలను వేయించి, ఇంగిలీకమువలె నెఱ్ఱగ గన్పడు దానిపైన అభ్రకపు బొడి చల్లించుటచే తళతళ మెరయుచుండెను. మహారాజులు, నవాబులు చతురంగసమేతముగా దర్బారుకైవచ్చి విడిసియుండిరి.