పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మని వేధింపసాగిరి. తుద కొక చిన్న కూలీవా డుండగా వానిని బిలిచి నా కప్పటికి వచ్చిన హిందూస్థానీభాషలో సమీపమున ఏదైనా బస కలదా యని ప్రశ్నించగా సత్రము కలదని జవాబు చెప్పెను. అంతట వానిచే సామాను పట్టించుకొని కాలినడకనే ఒకపెద్ద మేడయింటివాకిటికి పోతిమి. ద్వారములో ప్రవేశించగనే రెండువైపుల నెత్తగు గచ్చుటరుగు లున్నవి. అం దొకదానిపై నిరువురు నల్లనిగడ్డాలవారు తలపాగలు పెట్టుకొని చొక్కాలు తొడుగుకొని మనప్రాంతముల మహమ్మదీయులవలె హుక్కాపీల్చుచుండిరి. వ్రాతబల్లమీద రిజిష్టరు పెట్టుకొని లోపలికి పోవువారిపేర్లు వ్రాసుకొనుచుండిరి. ఆమేడ ఎవ్వరిదో స్వంతగృహము. నేను హిందూస్థానీలో నాకు ఆయింట బస దొరకునాయని వారిని అడిగితిని. దక్షిణపుమూల ఖాళీగాయున్నదని రోజు 1కి రు 6/- లు అద్దెఅనియు, ప్రత్యుత్తరమిచ్చిరి. నేనందుకు సంతసించి ఆరోజుకు రు 6/- లు నిచ్చి రసీదు తీసికొని మేడమీదికి సామానుతో పోతిని. తలదాచుకొనుట కిట్లుస్థలము దొరకినందుకు సంతసించుచు భోజనమునకై సమీపమున పూటకూలిబస కలదాయని విచారించితిని. కాని క్రిందనున్న నల్లగడ్డములవారు హిందువు లని తెలుసుకొనినపిమ్మట హిందువు లెవ్వరో, ముసల్మాను లెవ్వరో, హిందువులలో బ్రాహ్మణు లెవ్వరో, బ్రాహ్మణేతరు లెవ్వరో, బ్రాహ్మణు లైనను మాంసభక్షకు లెవ్వరో, కానివా రెవ్వరో నిర్ణయింపలేక, ఆకలితీరుటకు పాలును పండ్లును రొట్టెయును దిని కాలము గడపనెంచితిని. వీధివెంట బయలుదేరి కొంతదూరము పోవునప్పటికి ప్రతి అంగడిలోను పెద్ద కళాయిలవంటి పాత్రలలో పాలు పొయిలమీద