పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/146

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ట్లుండెను. పండిత అయోధ్యనాధ్‌గారు మహాసభ కధ్యక్షులుగ నుండిరి. వ్రాసి అచ్చొత్తించి ప్రకటించిన ప్రారంభోపన్యాసమును చేతబట్టకనే అందులో నున్న పదములతోడనే ఎచ్చటను మార్పులేకుండ మిక్కిలి నిపుణత్వముతో సహజసంభాషణవలె ప్రసంగించిరి. సురేంద్రనాధబెనర్జీగారి ఉపన్యాసము అద్భుతముగ నుండెను. ఇతరులు వ్రాసిన విషయములు విడికాగితములమీద వ్రాసి, ఆయన భాషించుసమయములో సందర్భమునుబట్టి జ్ఞాపకార్ధము వారి కార్యదర్శి కంటిఎదుట పెట్టీపెట్టకముందే గ్రహించి, ప్రసంగములో వాని నిమిడ్చిచెప్పు వైఖరియు వారి జ్ఞాపకశక్తియు ఆశ్చర్యముకల్పించెను.

డిల్లీమహోత్సవము చూడవలె నను కోర్కె యున్నది గాని నా కాహ్వానము రాలేదు. ముందుగా బసనిమిత్తము ప్రయత్నము చేయలేదు. ఇంతగా వ్యయప్రయాసల కోర్చి డిల్లీకి చేరినను అచట వసతి లేనియెడల ప్రయోజనముండదు. బసలు దొరకవని బయలుదేరినప్పుడు తెలియదు. డిల్లీకి రానుపోను రెండవతరగతిటికెట్టు ముందుగానే కొంటిని. పేరరాజుగారి నడుగగా తన బసలో మరియొకరికి వీలుండునో యుండదో తెలియదని చెప్పిరి. కాంగ్రెసుకు వచ్చిన ప్రముఖు లెందరో డిల్లీలో ముందే బసలేర్పరచుకొనిరి. వారందరును డిల్లీకి ప్రయాణమయి పోవుచుండిరి. నేనును కానీ, చూతమని వారితోగూడ పయనమై పోతిని. రైలుస్టేషనులో నిలువగనే ఎవరికివారు వెడలిపోయిరి. నేను నాసామానులతో స్టేషనులో నిలచిపోతిని. కూలీలు మాటిమాటికి వచ్చి సామాన్లు తెచ్చెద