పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మమ్ము తీవ్రవాదులని యెంచుచుండిరి. ఎన్ని లోపము లున్నను పత్రికాప్రకటనమాత్రము జరుపుచునేయుంటిమి.

ఈ సంవత్సరములలో నాకుటుంబమున కొన్ని యవాంతరములు నడచినవి. బందరుకు కాపురమునకు వచ్చునప్పటికి నాకు నాలుగేండ్ల కుమార్తె యొకతె యుండెను. పిమ్మట నిరువురు మగపిల్లలు గలిగిరి. అందొకనికి నాస్నేహితుడు చంద్రశేఖరుని పేరిడితిని. ఆ చిన్నవాడు రెండుసంవత్సరములు పెరిగి ప్లీహవ్యాధివలన చనిపోయెను. పిమ్మట కొలదిదినములకే నాభార్య ఇంకొక మగశిశువును ప్రసవించెను. స్ఫురద్రూపియగు పిల్లవానిని చూచుకొని, తల్లి పూర్వదు:ఖమును కొంత మరచిపోయెను. ఈ చిన్నవాడు మూడేండ్లలోపల మాటలన్నియు నేర్చి ఆమోదముగొల్పు సంభాషణలు చేయుచుండెను. చూచిన ప్రతివస్తువునుగూర్చి ప్రశ్నించి, తెలుసుకొనుచుండెను. రాత్రివేళల ఆకసమువంక జూచి, నక్షత్రముల వివరము లడుగసాగెను. కాని వీడును అయిదేండ్లు వచ్చునప్పటికి వ్యాధిగ్రస్తుడై 1902 లో మృతుడయ్యెను. రెండుమూడు నిమిషములలో జీవములు విడువబోవుచు ఎదుటనున్న తల్లికి రెండుచేతులు మోడ్చి నమస్కరించెను. పిమ్మట తలప్రక్కనున్న నావైపునకు ప్రయత్నపూర్వకముగ తిరిగి నమస్కరించెను. ఎన్నియో ఆశలు గొల్పిన ఈపిల్లవాడు పోవుటచే తల్లి మరింత దు:ఖసముద్రమున మునిగిపోయెను. నాకును హృదయవేదన అతిశయముగ నుండెను.


_____________