పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మరునాడు కాబోలును, సంతకములు చేసినవారి నందరిని భోజనమునకు బిలచి, వివాహమునకు వలయు సొమ్ము, ఇల్లు, పురోహితుడు మొదలగువిషయములు నిర్ణయించిరి. సుబ్బారావుగారు దక్షిణవల్లూరుసంస్థానమువారికి దివాన్‌జీగా నుండుటవలన వల్లూరివారి దివాణము వారిస్వాధీనములోనే యుండెను. అందు వివాహము నడుపుటకును, అవనిగడ్డనుండి పురోహితుని పిలిపించుటకును, తక్కినఏర్పాటులు చేయుటకును సుబ్బారావుగారే యొప్పుకొనిరి. వివాహము శాస్త్రప్రకారము మంత్రములతో జరిగెను. సంతకములు చేసినవా రందరు హాజరైరి. నేనును కొంతమంది మిత్రులు భార్యలతోగూడ హాజరైతిమి. ఆడువాండ్రందరు పెండ్లికూతురు మధ్య నిడుకొని ఛాయాపటము తీయించుకొనిరి. ఇంతచేసితిమిగాని ఆవధూవరులతో భోజనముచేయ సాహసింపలేకపోతిమి. ఏనుగుపై అంబారీలో వధూవరుల గూర్చుండబెట్టి మేళతాళములతో ఊరేగింపు జరిపితిమి.

ఇంత బాహాటముగ నిర్లక్ష్యముగ వివాహముచేసినందుకు బ్రాహ్మణసంఘము మమ్ము సంఘబహిష్కృతు లని తీర్మానించెను. మేమును దానిని లక్ష్యపెట్టక తగిన పురోహితునివలన మాయిండ్లలో కార్యములు నడుపుకొనుచు ఒకరితోనొకరము సఖ్యముగ నుండి కొంకక జంకక వర్తించితిమి. ఆరునెలలో మెలమెల్లగ బహిష్కారము సడలిపోయెను.

1900 సంవత్సరముననో లేక మరుసటిఏడో మిత్రులము ముచ్చటించుచుండగా తెలుగున వార్తాపత్రికలు మనజిల్లాలో