పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రదేశములో నప్పుడు స్త్రీపునర్వివాహసమస్య బలముగా చర్చింపబడుచుండెను. వితంతువులైన యువతులను తలిదండ్రుల సమ్మతిగాని పోషణకర్తల సమ్మతిగాని లేకుండ రహస్యముగ గొనివచ్చి, వివాహముసేయుట ఆక్షేపణార్హముగ నెంచుచుండిరి. పూర్వాచారాపరాయణత్వముచేతనో, సంఘ బహిస్కారభయముచేతనో తలిదండ్రులీ యుద్వాహము లంగీకరింపకపోవుటచే ఈ రహస్యమార్గము లవలంబించక తప్పినది దాదు. ఇట్లుండగా బందరుతాలూకాలో నొకగ్రామమునుండి పదిసంవత్సరముల బ్రాహ్మణవితంతుబాలికను ఆమె యన్న బందరు తీసికొనివచ్చి తగినవరుడు దొరకినచో వివాహము చేయుటకు పూనుకొనెను. నోబిల్‌కళాశాలలో బి. ఏ. లోనో ఎఫ్. ఏ లోనో చదువుకొను నొకవిద్యార్థి ఆపిల్లను వివాహమాడ సమ్మతించెను. అతడు మైనరు కాడుకాని బందరులో వారికి తోడ్పడువారు లేకపోయిరి. వివాహమునకు కొంత సొమ్ము కావలసియుండెను. ఇల్లు కావలసియుండెను. పురోహితుడును అవసరమే. బందరులోనే ఈయవకాశములు దొరకనపుడు మరియొకచో బొత్తుగనే దొరకవు. ఒకనాటి రాత్రి వేమూరి సుబ్బారావుగారు, చిదంబరరావుగారు మొదలగున్యాయవాదులము, కొంద రుపాధ్యాయులును ఒక మిత్రునియింట విందునకేగి, లోకాభిరామాయణము మాట్లాడుచుంటిమి. అప్పుడు ఈబాలవితంతువివాహమునుగూర్చి ముచ్చట బయలుదేరినది. ఆబాలిక దురవస్థ కందరును పరితపించుచుండిరి. నే నంతట "మనుమాత్రము ఈ సంఘస్థితికి బాధ్యులముకాదా, మనమేల భారము పైనవేసుకొని వివాహము జరిపించకూడ?" దని