పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈసందర్భమున మరియొక ప్రధానపురుషునిగూర్చి చెప్పవలసియున్నది. వల్లూరి సూర్యనారాయణరావు అనువారు హైకోర్టుపట్టా పుచ్చుకొని బందరు జిల్లాకోర్టులో న్యాయవాదిగా ప్రవేశించిరి. వయస్సున కొంచెము పెద్దలైనను నాకు సమకాలికులే. వీరు కాంగ్రెస్‌వ్యవహారములందును, సంఘ సంస్కరణవిషయములలోను ఉత్సాహముతో పాల్గొనుచుండిరి.

కాంగ్రెస్‌కమిటీసభలు పట్టణములో అప్పుడపుడు జరుగుటయేగాక వార్షికసభలు వానితోపాటు సంఘసంస్కరణసభలు కూడ జరుగుచుండెను. వెల్లటూరు, ఉయ్యూరు, నూజవీడు, నరసరావుపేట, గుంటూరు, బెజవాడమొదలగుచోట్ల ఈసమావేశములు జరిగెను. నే నప్పుడు చాల వర్షములు జిల్లాకాంగ్రెస్‌సంఘకార్యదర్శిగ నుండుటచే ఈమహాసభలలో పాల్గునుట తప్పనిసరి యయ్యను. ఈ సభలలో తెలుగుభాషలో నుపన్యసించుట నాకు బాగుగ నభ్యాసమైనది. ఒక్కొకపుడు నేను చేసిన ఉపన్యాసములను పలువురు మెచ్చుకొనుచుండిరి. అప్పుడు సామాన్యముగ ఆంగ్లేయవిద్య నేర్చినవా రొకచో చేరినపుడు ఆంగ్లేయభాషలో సంభాషించుటయు, మహాసభలలో ఆంగ్లేయభాషలో నుపన్యసించుటయు గౌరవకారణముగ నుండెను. కాంగ్రెస్‌సభలలో తప్ప తక్కిన సభలలో నేనును ఆంగ్లేయములోనే మాట్లాడుచుంటిని. కోర్టులోను, పాఠశాలలోను ఆంగ్ల మెట్లును తప్పదు. క్లబ్బులలోగూడ సంభాషణల కాంగ్లమే పరిపాటియాయెను.