పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పురాణము వెంకటప్పయ్యగారు, అన్నవరపు పుండరీకాక్షుడుగారు, వావిలాల శివావధానులుగారు. వీరు మువ్వురు పైన వ్రాసినక్రమముననే పేరుపొంది యుండిరి. ఇందు అన్నవరపు పుండరీకాక్షుడుగారు కొన్నిసంవత్సరములు బాపట్ల మునసబు కోర్టులో నుండి, పిమ్మట ఫస్టుగ్రేడు ప్లీడరీపరీక్ష నిచ్చి జిల్లాకోర్టులో న్యాయవాదిగా జేరిరి. ఈయన ఎక్కువ పట్టుదలతో పనిచేయుచుండెనుగాని వెంకటప్పయ్యగారికంటె తక్కువ శ్రేణిలోనే పరిగణింపబడుచుండెను. వీ రిరువురును చాలవరకు తమ వృత్తికార్యములందు శ్రద్ధజూపుటతప్ప సంఘవిషయములుగాని దేశవిషయములుగాని వారికి పట్టకుండెను. తక్కిన న్యాయవాదులలోనైనను పలువురు అట్టివారే. వావిలాల శివావధానులుగారు తమవృత్తియందే గాక, సంస్కృతజ్ఞానము కలవారగుటచేతను, దివ్యజ్ఞానసమాజసభ్యుడగుటచేతను మతవిషయములందు శ్రద్ధజూపుచుండిరి. జంధ్యాల గౌరీనాధశాస్త్రిగారు పండితసన్మానముచేయు పండితుడు, నైష్ఠికుడు. శ్రీ వెంకటరెడ్డినాయుడు, జె. డి. శామ్యుయల్ అనువా రిరువురు క్రిమినల్ కేసులలోనే ఎక్కువగా పనిచేయుచుండువారు. వారైనను స్వకార్యములుతప్ప ఇతరవిషయము లెవ్వియు పయిబెట్టుకొనక దూరముగ నుండువారే.

రెండవతరగతి న్యాయవాదులు వయసులో చిన్నవారును, కొంత ఉత్సాహము కలిగి దేశహితైకకార్యములందు అభిమానము గలిగియుండిరి. వేమూరి వెంకటసుబ్బారావను నొక సెకండుగ్రేడుప్లీడరు బందరులో పేరుబడ్డ కుటుంబములోని