పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/133

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నను ఉద్దేశ్యముతో నెవ్వరో స్వాములవారు ఆసమయముననే వచ్చిఉన్నందున - వారిసభకు మమ్ముల నందరిని హాజరుకావలసినదిగా నొటీసులిచ్చిరి. మేము చాలమందిమి నిర్భయముగనే హాజరయితిమి. ఆ బ్రాహ్మణసభాపతులలో నెవ్వరో లేచి, మేము వైశ్యులయింటి ఫలహారమును భుజించితిమికాబట్టి మమ్ము బ్రాహ్మణసంఘమునుండి బహిష్కరించవలసినదని చెప్పుచు, "మీరు ఫలహారమును భుజించిరా, లేదా" యని ప్రశ్నవేయగా మమ్ము నాప్రశ్నవేయుటకు వీ రెవ్వరికిని అధికారము లేదనియు, బ్రాహ్మణసభలో సభ్యులుగా నున్నవారు చేసిన, ఇప్పటికిని చేయుచున్న ధుష్కార్యములు అనగా భ్రూణహత్యలు చేసిన వారియొద్ద, వ్యభిచారులై కులముచెడిపోయిన వితంతువుల యొద్దను రహస్యముగ డబ్బు తీసికొని వారితప్పులను కప్పిపుచ్చుచు స్వాములవారికి వారిచే దక్షిణ లిప్పించి బహిష్కారమునుండి తొలగించుటయు మొదలగు పాపకార్యము లెన్నియో చేసినవారుగనుక వారిని ముందు విచారణచేసి తగినశిక్ష విధించిన పిమ్మట మామీద ఆరోపించబడిన నేరములను విచారించవలసినదని నేనే లేచి ఘంటాపధముగ వాదించునప్పటికి ఔనౌ నని మా మిత్రు లందరు కేకవేసిరి. సభకువచ్చిన పెద్దలు అక్కడనుండి మెల్లమెల్లగ లేచిపోయిరి. వారు వెడలిపోయినపిమ్మట మేమును మాయిండ్లకు చేరితిమి. అట్లు నేను తీవ్రముగా మాట్లాడుటలో ఆసభకు వచ్చిన జంధ్యాల గౌరీనాధశాస్త్రిగారిని గూడ అట్టి దుర్మార్గులను వెనుకవేసుకొని ఏముఖముతో ఇక్కడికి వచ్చితిరని కొంచెము పరుషముగనే మాట్లాడితిని. వారును ఏమియు మారుపలుకక సభనుండి లేచిపోయిరి. నామిత్రులు