పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/127

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


తొమ్మిదియకరముల మెట్టభూమిని రు 900 లకు అమ్మి ఆసొమ్మును ఉల్ఫుదొరగారికి కట్టితిమి. ఇంకను రు 600 లు, వడ్డీయును ఇవ్వతేలితిమి. ఆమొత్తమును పిమ్మట నెమ్మదిగా చెల్లుబెట్టితిమి. ఒక్కసారి యివ్వక జాగుచేసినందుకు దొరగారికి, డాక్టరు కుగ్లరుదొరసానికి కొంత అయిష్టము నాపై కలిగెను. కొలదికాలములోనే అంతయు చక్కబడెను. ఇది యంతయు నేను బందరు వెళ్ళిన రెండుమూడు సంవత్సరములలో జరిగిన వ్యవహారమే.

మేము మావృత్తిలో ప్రవేశించిన మొదటిరోజులలో అక్కడి న్యాయవాదు లెవ్వరును మమ్ము నభిమానించలేదు. జూనియరులుగా నుంచుకొని కొన్ని అప్పీళ్లు వాదించుట కిచ్చిన యెడల మావిషయము ఇతరుల కెరుకబడుట కవకాశ ముండెడిది. కాని అట్టి వీలు ఏర్పడదాయెను. గుంటూరునుండి సెకండుగ్రేడు ప్లీడరుగా పనిచేయుచుండిన న్యాపతి హనుమంతురావుగారును, గండవరపు సుబ్రహ్మణ్యముగారును అప్పుడప్పుడు కొందరు కక్షిదారులను అప్పీళ్ళు దాఖలుచేయునిమిత్తము పంపుచుండెడివారు. వారిమూలమున కొంచెముపని మాకు లభ్యమగుచుండెను. కాని మా ఇరువురకు సరిపడునంతపని లేకపోయెను.

ఇట్లుండగనే కొలచలమల అప్పయ్యదీక్షితులు అనగా నీటిలో బడి బ్రదికిన చిన్నవాడు బి. ఏ. పరీక్ష నిచ్చి, రాజ మహేంద్రవరమున గవర్నమెంటుకళాశాలలో నుపాధ్యాయు