పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/126

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


చెప్పిరి. వారివద్ద హాజరులోసొమ్ములేనిసంగతి వాస్తవమే. కనుకనే భూములుకొనుటయనిన ఇష్టములేకపోయను. ఇతరులయొద్ద రుణముతెచ్చుట వారికి బొత్తుగా సమ్మతములేనిపని. కాన నేనే ఏదో యుక్తమైన ఆలోచన చేయవలసివచ్చినది. కొంతవిచారించగా మిష్న్‌కాలేజీ అధ్యక్షుడుగా నున్న రివరెండు ఉల్ఫుదొరగారు రహస్యముగ రుణములిచ్చుచున్నారని తెలిసినందునను డాక్టరుకుగ్లరుదొరసానిద్వారా వారితో నాకు పరిచయమేర్పడి నందునను నేను బందరులో ప్లీడరుగా నున్నవిషయము వా రెఱిగినదే గనుకను నా అవసరము తెలిపి 1500 ల రూపాయలు రుణముకావలెననియు అందుకు నేనును నాతండ్రిగారును కలిసి ప్రామిసరీనోటు వ్రాసిఇచ్చెదమనియు త్వరలోనే తీర్చెదమనియు చెప్పగా ఆయన సమ్మతించి రుణమిచ్చిరి. బాపట్లలో స్నేహితునకు పంపవలసిన 200 లును మానాయనగారే సర్దుబాటుచేసిరి. ఈ 1500 లు వాయిదాలోపల సర్కారుకు కట్టివేసితిమి. ఈ భూములకు నేను పాటదారుడ నగుటచే నాపేరటనే పట్టా జారీ చేసిరి. మా తండ్రిగారిపేరనే పెట్టించవలెనని ఆలోచన నాకు తోచలేదు. నాపేర నున్నను జాయింటుకుటుంబముదే నను భావముతో నేను వ్యవహరించితిని. పిమ్మట ఆభూములున్న జమ్ములపాలెము పోయి, ఆసామీలను కుదిర్చి, వాటిని సాగుకు తెచ్చుట మొదలగు పనులన్నియు నేనే చేసితినిగాని మాతండ్రిగారు ఆపని పెట్టుకొనలేదు. ఉల్ఫుదొరగారి కియ్యవలసిన సొమ్ము పెద్దమొత్తముగానుండుటచేతను మానాయనగారు సంపాదించిన మెట్టభూమి కొంత ధర పలుకుచున్నందునను దానిపై సాలుకు ముప్పది నలుబదికంటె ఆదాయము లేదుగాన