పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/115

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


పచ్చయప్పకళాశాలలో ఆంగ్లేయమున ఉపన్యసించిరి. మన దేశపు బరిస్థితులనుగూర్చి చెప్పుచు "బైబిలులో పాలస్థైన్ దేవుని కభిమానదేశమని చెప్పబడినది. కాని నాయూహలో భారతదేశమే అట్టిదనితోచుచున్న" దనిరి. ఏలననగా, ఈదేశమునందు లోకమునందలి సర్వజాతులయొక్కయు, సర్వమతములయొక్కయు ప్రతినిధులు నివసించుచున్నారుగాన, మానవసంఘ పరమావధి, ఈదేశమునందే నిర్ణయముకానున్నదని వక్కాణించిరి. ఆనాడు వారు చెప్పిన వచనములను పరమసత్యములుగా పరిగణించవచ్చును. ఈనాడు మనకు లభించిన స్వాతంత్ర్యమును, నిజముగా రామరాజ్యము చేయగలిగితిమేని భారతదేశము లోకమున కంతకును మార్గదర్శకము కాగలపరిస్థితులు ఏర్పడును. రెవడీగారు అప్పటికి ఏండ్లుచెల్లిన ముదుసలిగా నుండి, కనుచూపు సయితము లోపించి యుండెను. ఆయన పొడగరి. గండు మొగము, విశాలఫాలభాగము పెద్దశిరస్సు గలిగి వారు శాంత స్వరూపులుగానుండిరి. ధోవతియు, బొందుల తెల్లని అంగరఖా మహారాష్ట్ర పగిడి, ఉత్తరీయమునుధరించి, నెమ్మదిగా సులభములగు పదములతో భావములను దొరలించుచుండెను. ఆధోరణి వినుటకు ఇంపును, మనస్సునకు ఆనందమును గల్గించి, జ్ఞానబోధ గావించుచుండెను. వీరు ఆనాటి పెద్దలలోకెల్ల బెద్దలు. దేశసేవా తత్పరులు, విద్యాప్రవీణులు, రాజకీయములందును, ఆర్థిక విషయములందును ఆరితేరినవారు. దైవభక్తిచే న్యాయవర్తనముచే ప్రసిద్ధికెక్కినవారు. ఆర్థికశాస్త్రముగూర్చి యొకగ్రంథమును వ్రాసి ప్రకటించిరి. మిక్కిలిపెద్దవారై మరికదలలేని కాలములో