పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/114

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అను వ్యాసములు వరుసగ క్రైస్తవకళాశాల మాసపత్రికలో ప్రకటింపబడెను. అందులో అడయారులో ప్రదర్శితములైన అద్భుతములెల్ల మాయోపాయములచే చేయబడినవని వివరించుటచేత, దివ్యజ్ఞానసమాజముపైన విశ్వాసము ప్రజలలో తగ్గిపోవ నారంభించెను. కాని అద్భుతములమాట ఎట్లున్నను, మనపూర్వశాస్త్రములందలి యభిమానము నానాటికి హెచ్చుచునే వచ్చినది. ఆధునిక భౌతిక శాస్త్రము కంటె మన మహర్షుల ఆధ్యాత్మికవిద్య ఉత్తమమని ప్రజలు గుర్తించసాగిరి. ఈ దివ్యజ్ఞానసమాజము మొత్తమున మన భారతజాతిని మేలుకొలిపె ననుట స్పష్టము. పిమ్మట దేశములో ఉద్భవమొందిన రాజకీయాందోళనమునకు ఈసమాజప్రభోధములు కొంత తోడ్పడినవనుటకు సందియములేదు. మరికొన్ని సంవత్సరములకు అనిబిసెంటు అనునామె దివ్యజ్ఞానసమాజమునకు అధ్యక్షురాలుగా నున్నకాలములో అనన్యమగు విజ్ఞానసంపత్తి, అసమానమగు స్వానుభవమును సంపాదించి లోకమునకు అన్ని వేళలయందును సేవచేసి, పొగడ్త నందినది.

"గోవిందరెవడీ" అనువారు పూనాపట్టణవాస్తవ్యులు, మహారాష్ట్రబ్రాహ్మణులు, దేశస్థు లనుశాఖకు చెందినవారు. వీరు బొంబాయిహైకోర్టులో న్యాయమూర్తిగానుండిన కాలములోనే చెన్నపట్టణములోని మూడవ కాంగ్రెసుసమావేశమునకు వచ్చినట్లు పైనచెప్పబడినది. ఆరోజులలోనైనను ప్రభుత్వోద్యోగులు కాంగ్రెసుకు బోవుటకు ఆక్షేపణగాని ఆటంకముగాని లేదు. పిమ్మట మరియొకసారి వారు చెన్నపట్టణము వచ్చి,