పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/111

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మునుబట్టి బాడుగను తీసుకొనుచుండెడివారు. మేము ఉండెడి భాగమునుకు బ్లాకుటౌను అని పేరు. (నల్లవారి బస్తీ యని) ఈపేరు బహుశ: తెల్లవారు పెట్టియుందురు. ఈ బ్లాకుటౌను నుండి తిరువళ్కేణి పోవుటకు ఒక్కొక్కరికి మూడూణాల బాడుగ అని జ్ఞాపకము. అప్పటికింకను ట్రాములు, బస్సులు లేవు. కొన్ని వీధులలో తిరుగునప్పుడు, కొన్నిఇండ్లకు వెలుపల, ద్వారముదగ్గర, అన్నసత్రము అని వ్రాసినబల్లలు కట్టబడి యుండెను. ఇట్టివి అనేకములు కనబడినందున, అన్నదానము విశేషముగా చేయుదురు కాబోలు అనుకొంటిమి. విచారించగా, అన్నసత్రము లనునవి పూటకూళ్ళని తేలినది. మరియు, చెన్నపట్టణములో ఏవస్తువునైనను బేరముచేయుట మిక్కిలి కష్టముగా నుండెను. వస్తువుధరకు నాలుగురెట్లు అయిదురెట్లు ఎక్కువ వర్తకుడు చెప్పుచుండును. మిక్కిలి తగ్గించి అడిగిన నత డేమనుకొనునో యనియు పట్టణమున ధరలు అతిశయముగా నుండునేమో అనియు దలంచి, అర్ధయో, పావలో తగ్గించి అడిగినప్పుడు "తీసుకొనుడు, మీకుగనుక ఇచ్చుచున్నా"నను ఇచ్చకములు పలికి వస్తువునకు హెచ్చుధర రాబట్టుకొనుచుండెను. ఈపరిస్థితులు పరిచయమైనపిదప, సగమునకుసగము తగ్గించి ధరయడుగ నేర్చుకొంటిమి. కావుననే చెన్నపట్టణమున బురిడీ (మోసము) మోపని అంతటను వాడుక అయినది. ఇప్పుడు మన తెలుగుదేశమున బస్తీలలో బేరగాం డ్లిట్టిధరలే చెప్పి, తెలియనివారిని మోసగించి హెచ్చుధరలు గుంజుకొనుచున్నారు. వర్తకమనిన మోసమే యనుభావము దేశమున వ్యాపించియుండుట శోచనీయము.