పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/11

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


పంతులుగారి ఆకారప్రజ్ఞాబలసంపద లంతచెప్పుకోదగ్గవికావు. విద్యలో, వాచాలతలో వారిని మించిన తెలుగువారున్నారు. భోగరాజువారి ప్రజ్ఞాప్రకర్షగాని, టంగుటూరివారి సాహసరసికతగాని, కాశీనాథునివారి వితరణవీరముగాని కొండ వారికిలేవు. అట్లయ్యు, వీటినన్నిటిని మించిన సత్యతత్పరల, ఆస్తిక్యము, వినయము, నిరంతరసేవాసక్తి, ఆత్మవితరణము - ఇవి దేశభక్తుని సమానులలో ఉత్తమళ్లోకు నొనర్చినవి. పంతులుగారి హృదయము కుసుమకోమలము. కావుననే వజ్రకరోరత నపేక్షించు రాజనీతిధౌరంధర్యము వారి కలవడలేదు. పంతులుగారి జ్ఞానశక్తికంటె క్రియాశక్తి దొడ్డది. క్రియాశక్తికంటె భక్తిపరిప్లావితమగు వారి ఆర్ద్రచిత్తత దొడ్డది. కనుకనే వారి సేవాశీలము మాత్సర్యము నెఱుగదు. వారి ప్రభుత ఘృణాలలితమై, పట్టువిడుపులు నేర్చికొని, యుదారచరిత కాస్పదమైనది. గాంధిజీపిలుపు పంతులుగారి గోపికాహృదయమునకు వేణునాదమైనది. చిన్ననాటనే నాటకములలో స్త్రీపాత్ర మధినయించిన పంతులుగారికి రసతత్పరత వెన్నతోబెట్టినవిద్య. కవిగాదగిన పంతులుగారు రాజకీయజంబాలమున బడినను ఒడలు బురదగాకుండ సాధుహృదయమును సంరక్షించుకొనిరి.

ఈ గ్రంథమున పంతులుగారి కలము కావ్యపాకము నందికొన్న ఘట్టము లెన్నియో యున్నవి. దాపరిక మెఱుగని వారి సత్యసంధత, మాయమర్మము లెఱుగని వారి అచ్ఛశీలము, చేటుపాట్లెఱుగని ఉతాహశక్తీ - అడుగడుగున నిందు ప్రత్యక్షమగును. పంతులుగారు హాస్యరసమునుగూడ నిందు ఎడనెడ చవి చూపిరి. ఆంధ్రభాషకు, చరిత్రకు అలంకారప్రాయమైన ఈ స్వీయచరిత్ర పరిపూర్తినందక 1932 లో నాగిపోవుట మన దురదృష్టము. అందీ ప్రధమభాగము 1918 వరకు నడచినది. అనతికాలమున రెండవభాగముగూడ ప్రకటింతుము. అమూల్యమగు ఈ గ్రంథప్రచురణభాగ్యము మా సంఘమునకు గల్పించిన పంతులుగారి కుటుంబమునకు గృతజ్ఞులము.

కాటూరి వేంకటేశ్వరరావు.

సాహిత్యశాఖాధ్యక్షులు.

ఆంధ్రరాష్ట్ర హిందీ ప్రచార సంఘము

విజయవాడ,

2 - 2 - 1952.