పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజ్ఞప్తి

వీరేశలింగంపంతులు స్వీయచరిత్రతో మన భాషలో స్వకథాకథనము పరిపాటియైనది. రాయసం, చిలకమర్తి, టంగుటూరివారల స్వీయచరిత్రలును, దేశభక్తుని యీ స్వీయచరితయు 19 వ శతాబ్ది చతుర్థచరణముతో మొదలిడి, యించుమించుగా ఈ శతాబ్ది మధ్యభాగము వరకు నడచినవి. ఈ డెబ్బది యెనుబదేండ్లలో మనదేశమున ఎన్నో యుద్యమములు తలచూపినవి. మన సంఘవ్యవస్థ కొత్తరూపు దాల్చినది. పరప్రభుత్వము గూడ ఒత్తిగిలి భారతమున స్వతంత్ర ప్రభుత నెలకొన్నది. ఈమార్పులన్నిట భాగస్వాములై, వాటికి రూపరేఖలు దిద్దిన ఆంధ్ర మహాపురుషులలో దేశభక్త వేంకటప్పయ్య పంతులుగా రగ్రగణ్యులు.

పంతులుగారు తనువెత్తి చాలించులోపల మూడుపురుషాంతరములు గడచినవి. ఈ మూడుతరములవారిలోను పంతులుగా రెప్పటికప్పు డగ్రగాములై నిలిచిరి. మదరాసులో కళాశాలావిద్యార్థుల సమ్మెలో వారిదే ముందంజ. బందరున మొదటి వితంతూద్వాహమున వారిదే ప్రథమతాంబూలము. కృష్ణాజిల్లాసంఘములో నారంభించిన పంతులుగారి రాజకీయజీవనము స్వరాజ్యలబ్థివరకు ఒక్కతీరున సాగినది. కృష్ణాపత్రిక వారి కూరిమిబిడ్డ. ఆంధ్ర జాతీయకళాశాలా స్థాపకులలోను పంతులుగారున్నారు. స్త్రీవిద్యకై శారదానికేతన సంకల్పము వారిది. వృత్తివిసర్జనమొనర్చి, జీవితమును ప్రజారాధన కంకితమొనర్చిన మొదటి ఆంధ్రులు పంతులుగారు. 1887 లో మదరాసున మూడవ కాంగ్రెసుమహాసభ జరిగినపుడే అచట విద్యార్థిగా నున్న వెంకటప్పయ్య తన చేతికి కాంగ్రెసుతోరము కట్టుకొనెను. అది మొదలు స్వరాజ్యలబ్దివరకు గడచిన ఏబదేండ్లలో ఆంధ్రజీవననౌక నాయనయే కర్ణధారియై నడిపించెను. ఇవి యన్నియు నొకయెత్తు, ఆయన స్వయము కని పెంచిన ఆంధ్రోద్యమ మొకయెత్తు. ఆంధ్రరాష్ట్ర మాంధ్రరాష్ట్ర మని జపించుచునే వీరపుంగవుడగు దేశభక్తుడు తనువుచాలించెను. ఇట్లు బహుముఖముల విస్తరించిన పంతులుగారి స్వీయచరిత్రయే ఈ డెబ్బదేండ్ల ఆంధ్రదేశచరిత్ర. పంతులుగారి ప్రజారాధన ప్రవణత తెలుగునేల యెల్ల లతిక్రమించినదిగాన భారతదేశచరిత్రగూడ నిందు అల్లుకొనియున్నది.