పుట:Konangi by Adavi Bapiraju.pdf/84

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

“మా ఇంటికి రాకూడదు కాబోలు.”

“వచ్చే ఉందును అనంతం. కాని నేను మీ ఇంట్లో ఉండడం అనేక కారణాలవల్ల మంచిదికాదు. నీకు గురువు నవడంవల్ల నా జీవితమే మారి పోయేటట్టు ఉంది.

“అలాంటా రేమిటి, ఏమి మారుతుందంటారు?”

“మారడం అంటే, నేను ఏ ఆవునో, మేకనో, గుట్టాన్నో, కుక్కనో అవుతానని కాదుసుమా!”

“ఏమో బాబూ! మీరల్లా అయిపోతే!”

“వహ్వా! వేశావు బాణం! అది నిజమే, మీ ఇంట్లో కాపురానికివస్తే కుక్కా గుట్టాన్నీ కాదుగాని గాడిదను అవుతానని భయం.”

“మేమంతా గాడిదలమనా?”

“మంచిదానవే నువ్వు! మీది మంచి తోటన్నమాట. ఆ తోటంతా మేసే గాడిదలా వస్తానన్నమాట!”

“నాకు మీ మాటలు ఏమీ బాగాలేవు గురువుగారూ!”

“మీ ఇంట్లో చేరితే నువ్వు సర్వకాలమూ నా ఎదుటే ఉంటే, నా హృదయమూ, ఆత్మా నీకు సర్వార్పణమైతే ఇంక నా పని ఏమిటి? నేనని ప్రత్యేకత ఏమవుతుంది?”

“ఏమి కవిత్వమండీ!”

“నిన్ను చూస్తే ఎవరికి కవిత్వం రాదూ?”

“చెట్టియారుకు వచ్చిందా?”

“ఏమో, అరవంలో ఎంత కవిత్వం రాస్తున్నాడో?”

“కవిత్వం రాదుగాని కపిత్వం వస్తుంది.”

“వట్టి కోతయిపోతాడన్నమాట. నేను గాడిదనయినట్లు.”

“మిమ్మల్ని మీరలా తిట్టుకోకండి.”

అనంతలక్ష్మి ఆ మాట మహామధురంగా అన్నది. ఆ మాటలు కోనంగి గుండె చెదరగొట్టాయి. అనంతలక్ష్మిని కోనంగి తన దగ్గిరగా తీసుకొని గట్టిగా కౌగలించుకొని, “నేను దొంగతనం చేస్తున్నాను అనంతం! వట్టి నిరుపేదను. అయినా నీ జీవితాలయంలోకి, ఈలా నిర్భయంగా వస్తున్నాను” అంటూ ఆమె పెదవులను తనివార చుంబించినాడు.

అనంతలక్ష్మి కరిగిపోయింది. ఆమె కన్నుల నీరు తిరిగింది. అనంద పరవశయైన ఆమె పెదవుల మధురహాసము నృత్యము చేసింది. ఆమె ధైర్యముతో కోనంగిని తనంతట తానే కౌగలించుకొని, అతని మోము వంచి, అతని పెదవుల ముద్దు పెట్టుకుంది.

ఇద్దరికీ సర్వప్రపంచమూ మాయమైంది. ఇద్దరే విశ్వంలో. వారు జంట సెలయేళ్ళు, మహానదులు, వారు అగ్నివాయువులు, వారు రెండుపూవులు, వారు మేఘము మెరుములు, వారు కేరటము సుడిగుండమూ, వారు కొమ్మలో కోకిలజంట!

ఆ మధుర మత్తతలో ముందర మేల్కొన్నది కోనంగే. “అనంతలక్ష్మీ! నేను మీ ఇంటిలో ఉండడము మంచిదికాదు. మీ తల్లికి మన వివాహం సంగతి మనము ఇద్దరమూ చెప్పాలి. అందుకు కొంచెం ఓపికపట్టు. ప్రస్తుతము నీ పరీక్ష అయినవరకూ మన ప్రేమ సంగతి మరిచిపో. చదువు పూర్తి కాగానే, మన విషయం తేల్చుకుందాము” అని అంటూ కోనంగి అనంతలక్ష్మిని తన హృదయానికి మరొకసారి అదుముకొని ఆమె పెదవులు, కన్నులు, తల, మెడ, బుగ్గలు తనివార ముద్దులవర్షంతో నింపినాడు.