పుట:Konangi by Adavi Bapiraju.pdf/80

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

అనంత: నేను అంబుజాన్ని మాత్రం రమ్మన్నానా? ఏదో కాస్తతల నొప్పివస్తే ఈ గడబిడ అంతా ఎందుకే?

అంబుజం: ప్రేమ తలనొప్పా అంటే, ప్రేమ కడుపునొప్పి అంటుంది.

మెహర్: అనంతానికి తప్పక ప్రేమజబ్బే పట్టుకుంది.

అనంత: బాలికలలో చంద్రునివంటిదానవు. నీకు తెలియదటే మెహర్?

మెహర్: నాకేమి చెప్తావు నువ్వు? నీకు కొత్తగా అందాలరాయుడు ప్రయివేటుగా తెలుగు చెప్తున్నాడుగా?

అనంత: ఎవరు చెప్పినారే నీకు? మెహర్: పార్వతే!

అంబుజం: పార్వతా! అది హైకోర్టు జడ్జిగారి కూతురు. దానికి తెలియకపోతే ఇంకెవ్వరికి తెలుస్తుందే. అదిగో పార్వతిగారు వయ్యారంగా నడిచి వస్తోంది.

పార్వతి నిజంగా వయ్యారంగానే నడచి వచ్చింది. లోనకు రాగానే అనంతాన్ని కౌగలించుకొని, “ఆ చెట్టి నిన్ను బాధపెడుతున్నాడేమిటే?” అని ప్రశ్నించింది.

అంబుజం: ఆ మొద్దురాయడేనా? వాడు అనంతాన్ని బాధపెడ్తాడా పార్వతీ? వాడి పళ్ళు రాలగొట్టదూ అనంతం!

మెహర్: ఏమే పార్వతీ, ఎవరా కొత్తమాష్టరు? అనంతానికి తెలుగు పాఠాలు చెప్పేది?

పార్వతి: ఒక్క తెలుగేమిటి! ఇంగ్లీషు కూడా చెపుతున్నాడు.

అంబుజం: అతనికీ, అనంతం తలనొప్పికి సంబంధం ఏమిటి?

మెహర్: వచ్చింది, ప్రేమ తలనొప్పి కదా, పాఠాలు చెప్పే పెద్ద మనిషి ఇంట్లో ఉంటే తలనొప్పి తగ్గించలేడూ?

అనంత: ఈలాంటి మాటలంటే, కాలేజీకికూడా వినబడేటట్టుగా కేక వేస్తాను.

2

కోనంగిరావుకు ఏమిచేయాలో తోచదు. అతనికి ఏ ప్రభుత్వ ఉద్యోగమో చేయడానికి ఇష్టంలేదు. అతనిలో రాజకీయాలు వట్టి మబ్బులులా ఉన్నాయి.

కాంగ్రెసు మహాసంస్థ అనీ, కాంగ్రెసు నాయకులైన మహాత్మాగాంధీ లోకనాయకుడని అతని నమ్మకము. కాని అతనికి అహింస ధర్మాశయంఎల్లా అవుతుందో అర్థంకాలేదు. కాంగ్రెసు రాజకీయాలుగాని, సాంఘిక వాదాలుగాని, సామ్యవాదాలుగాని పూర్తిగాతెలియని విద్యార్థిగా ఉన్నప్పుడు, విద్యార్థి రాజకీయ సభలలో అతడు చేరలేదు.

కోనంగి మతవిషయికాలు అంత ఎక్కువ చదువలేదు. హిందూమతమంటే, బౌద్దమతమంటే, క్రైస్తవమతమంటే ఏమీ తెలియదనే చెప్పాలి. వేదాంతం అంటే ఏమిటో ఎరగడు. ఉపనిషత్తుల పేరులే తెలియవు ఏ మతపుస్తకాలూ ఎప్పుడూ చదవలేదు.

కోనంగి పాఠ్యపుస్తకాలు బాగా చదివేవాడు. ఆ పాఠ్యపుస్తకాలకు సంబంధమైన పుస్తకాలూ బాగా చదివేవాడు.

పాశ్చాత్యుల మనస్తత్వశాస్త్రం అతడెరగడు. జ్ఞానపిపాస ఒకమోస్తరుగా ఉండేది.

తెలుగు కోసం తన పాఠానికి పుస్తకాలు బాగా చదివాడు. ఈలా చదివిన పుస్తకాలు మాత్రం బాగా అర్థం అయ్యేవరకూ వదిలేవాడు కాడు. అలా అర్థం చేసుకొని పరీక్షలలో ప్రశ్నలకు ఎంతో బాగా ప్రత్యుత్తరాలు రాసేవాడు. అందుచేత అతనికి మొదటి మార్కులు వచ్చేవి.