పుట:Konangi by Adavi Bapiraju.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కోనంగి పందిరి మంచంమీద పడుకొని ఏమిటి అనంతలక్ష్మి ప్రేమ? ఈ బాలిక తన్ను గాఢంగా ప్రేమించిందా, లేక యౌవనపు ప్రథమ సంవత్సరాలలోని కాంక్షలను ఈ రీతిగా తీర్చుకొంటున్నదా? తనకూ స్త్రీ వాంఛ కలుగుతున్నమాట నిజమే! కాని ఫలానా స్త్రీ అన్నది లేదు. అసలు సౌందర్యం స్త్రీ సంపర్కభావం కలిగింది. ఈనాడు హృదయం మధ్య ఈ అందాలబాల చేరింది. ఇది పెద్ద గడ్డు సమస్య తనకు.

తానా బీదవాడు, రేపటి తిండి ఎట్లాగో తెలియక వీధుల గడిపే పాంథుడు. ఈ బాలిక ఐశ్వర్యవంతురాలు. తన కీ సమయంలో వివాహం ఏమిటి? వివాహం చేసుకుంటేగాని, తనకూ, స్త్రీకీ సంబంధం ఉండకూడదు. అది పెద్ద వేదాంతభావము కాదు. నైతికభావమూ కాదు. అది మానవ న్యాయం.

పెళ్ళిళ్ళు జాతికి ఒక చక్కని రహదారి మార్గం వంటివి. పురుషుడు వేడి ఎక్కి ఇష్టం వచ్చినట్లు సంచరించవలసిన అగత్యమేమి? అమెరికాలోవలె వివాహాలు చేసుకోవచ్చును. రద్దు చేసుకోవచ్చును. స్త్రీ పురుష సంబంధం కలుగజేసుకుందామను కున్నప్పుడు వివాహం చేసుకొని, ఇష్టంలేనప్పుడు విడిపోవచ్చును. ఇంత చక్కని రాజమార్గం ఉంటే, అమెరికాలో కూడా, వట్టి మూర్ఖదారుల తిరుగుతారెందుకో స్త్రీ పురుషులు.

అతడు నెమ్మదిగా నిద్రకూలాడు. తెల్లవారగట్ల కలలు వచ్చాయి. యేవేవో అస్పష్టమైన కలలు. ఇంతగా తాను ఎక్కడో పొలాలలో కూలి వానిగా ఉన్నాడు. అనంతలక్ష్మి కూలిపిల్లగా చక్కా వచ్చింది అక్కడకు. తాను ఆమెను తప్పించుకొనడానికి ముందుకు పరుగు, ఆమె తరుముకు వచ్చింది. తానేదో కాలికి తగిలి క్రిందపడినాడు. అనంతలక్ష్మి పకపక నవ్వుతూ, “దొంగ దొరికాడు” అంటూ తనమీదవాలి భుజాలు రెండూ గట్టిగా పట్టుకుంది.

అతనికి చటుక్కున మెలకువ వచ్చింది. అనంతలక్ష్మి దేవతా బాలికలా తనమీదకు వ్రాలి రెండు భుజాలు పట్టుకొని, “ఇంకా నిద్దురే. తెల్లవారింది, ఎండ వచ్చింది, లెండి!” అని కదుపుతోంది.

6

కోనంగి గబుక్కున లేచి కూర్చున్నాడు.

“మీమీద ప్రేమ నన్ను గాఢంగా పొదివికొంది. నన్ను అమ్మతో చెప్పనే చెప్పవద్దన్నారు ఈ విషయం. అమ్మ స్నానం చేస్తోంది. స్నానం అవగానే జపం చేస్తుంది. అంతవరకూ బయటకు రాదు. అప్పటివరకూ కాఫీ అయినా తాగదు కాబట్టి మనం మాట్లాడుకునేందుకు కావలసినంత వ్యవధి ఉంది” అని అనంతలక్ష్మి తలవాల్చి అన్నది.

కోనంగి: అనంతలక్ష్మి, మీ అమ్మగారు నన్ను నువ్వు ప్రేమించడానికి వప్పుకోరు.

అనంతలక్ష్మి: మీరు ప్రేమిస్తున్నారా లేదా?

కోనంగి: నేను నిన్ను ప్రేమించకుండా ఉండగలనా లక్ష్మీ! నువ్వు నా దేవతవు. నేను ప్రేమ అనేది ఎరుగను. అది ఉంటుందనే తెలియదు. స్త్రీని అప్పుడప్పుడు వాంఛించాను. కాని వివాహం కాకుండా స్త్రీ సంపర్కం అనుభవించడం నా మతం కాదు. నాకు అర్థం కాదాభావం. ప్రేమ అన్నా ఉండాలి, అనుకూలమైన దాంపత్యమన్నా కావాలి. నాకు స్త్రీవాంఛ కవిత్వవాంఛ, సంగీతవాంఛ వంటిది. స్త్రీలకు పురుషవాంఛ, పురుషులకు స్త్రీవాంఛ, ఏదో ఉత్తమ పథాలలో ఉండాలని అనుకుంటాను. అందుకని నాలో కలిగిన