పుట:Konangi by Adavi Bapiraju.pdf/63

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఎదురుగుండా మంచంమీద అనంతలక్ష్మి కూచుని ఉంది. ఆమె వెనుక జయలక్ష్మి కుర్చీలో అధివసించి వుంది.

“గురువుగారూ, ఏలా వుంది?”

“ఎలా ఉండడమేమిటి?” (మాట నీరసంగా వుంది.)

“మీకు పదిహేనురోజుల నుండి ఒళ్ళు తెలియని జ్వరం. మీ ఒళ్ళంతా హెూనమై ఉంది. ఏమిటిదంతా?”

నర్సు “నెమ్మదిగా చెప్పండి కబుర్లు. రోగి ఆవేదన వృద్ధి చేయకండి. ఆయన ఒంటికి మంచిదికాదు” అని అన్నది.

అనంతలక్ష్మి: అలాగేనమ్మా!”

జయలక్ష్మి: మీ కోసం రెండురోజులు చూచింది మా అమ్మాయి. దాని బాధ ఎక్కువ అయింది. చివరకు పదిరోజుల క్రిందట నేనూ, అమ్మాయి మీకోసం హెూటలు గుజరాత్ వెళ్ళాం. వచ్చిందాకా ఊరుకొంటేనా? అక్కడ ఒళ్ళుతెలియని జ్వరంలో ఉన్నారు. హెూటలువారు మీకేదో మందిప్పిస్తున్నారు. జ్వరంతో అనేరకాల మాటలు. మా కారుమీద ఎక్కించుకొని మా ఇంటికి తీసుకువచ్చాం: మా కుటుంబం డాక్టరు రెడ్డిగారు శాయశక్తులా పనిచేశారు. ఒళ్ళుగాయాలకు కట్టుకట్టించారు. ఇంజక్షనులు ఇచ్చారు. రక్తం పరీక్షచేశారు. నిన్నరాత్రి చటుక్కున జ్వరం తగ్గింది. మీకు వచ్చిన జ్వరం పెద్దరకం మలేరియాటండి. అందులో తలమీద ఏవో దెబ్బలు తగిలి ఆ మలేరియావల్ల మీరు మమ్ము గుర్తు పట్టలేకపోయారు అని తెలిసింది.

“అబ్బా! ఇంత పెద్దగాధ జరిగిందటండి?” అని నీరసంగా నవ్వాడు కోనంగి.


చతుర్థ పథం

ఆరోగ్యం

కోనంగి, చిక్కిన మోముతోనూ, గడ్డం, మీసం పెరిగిన మోము తోనూ తదియనాటి వెన్నెలలా నవ్వుతూ “అదోరకం మలేరియా, పెద్దరకం మలేరియాయే వచ్చింది మన పెద్దరికం తీసేసింది” అని మళ్ళా అన్నాడు.

అనంతలక్ష్మి అతని సంతోషానికీ, అతడు సలిపే హాస్యానికీ, అతడు బ్రతికాడన్న దివ్యభావానికీ ఎండా వానలా పకపక నవ్వుతూ, కళ్ళనీరు జలజల కారుస్తూ మళ్ళీనవ్వుతూ నుంచుంది.

మన నాటుకోటి చెట్టిగారు, పాపం, ఈ పదిరోజులూ వచ్చి కోనంగికి ఎల్లా ఉందని కనుక్కుంటూనే వున్నారు.

“ఆ హెూటల్లో జబ్బుపడి ఉన్న మనిషిని, ఈ అనంతలక్ష్మి తీసుకు వచ్చింది. దీనికి బుద్ధిలేదు! బోగందానిగుణం పోగొట్టుకొందికాదు! ఈ దుర్మార్గుడు చావనన్నా చావక ఈలా బ్రతికి ఉన్నాడు. అయినా తొందరలేదు. జ్వరం తీవ్రంగా వస్తోంది. ఇంతవరకు తెలివిరాలేదు. వచ్చినా అది సంధి తెలివి. ఒకవేళ జ్వరం తగ్గిందా, తనకు తగిలిన దెబ్బలకు బుద్ధివచ్చి ఇకరాడు. వచ్చాడా, ఇంకో చక్కని మార్గం చూచుకోవచ్చును.